ఇంగ్లండ్ పర్యటనలో గెలవాల్సిన మరో మ్యాచ్ భారత్ చేజారింది. ఆతిథ్య జట్టు నిర్దేశించిన 193 పరుగుల లక్ష్య ఛేదనలో టాపార్డర్, మిడిలార్డర్ విఫలమైనప్పటికీ రవీంద్ర జడేజా తన కెరీర్లో మరో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చేందుకు సర్వశక్తులూ ఒడ్డినా ఫలితం మనకు అనుకూలంగా రాలేదు. టెయిలెండర్ల అండతో జడ్డూ చివరిదాకా పోరాడినా.. ఆఖర్లో సిరాజ్ దురదృష్టవశాత్తూ నిష్క్రమించడంతో సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
లార్డ్స్: టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీలో భాగంగా ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో భారత్, ఇంగ్లండ్ మధ్య ఆద్యంతం రసవత్తరంగా సాగిన మూడో టెస్టులో టీమ్ఇండియా పోరాడి ఓడింది. 193 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన భారత్.. 170 పరుగుల వద్దే ఆగిపోవడంతో ఇంగ్లండ్ 22 రన్స్ తేడాతో గెలిచి సిరీస్‌లో 2-1 ఆధిక్యం సాధించింది. ప్రస్తుతం భారత జట్టులో అత్యంత అనుభవజ్ఞుడైన రవీంద్ర జడేజా (181 బంతుల్లో 61 నాటౌట్, 4 ఫోర్లు, 1 సిక్స్) జట్టును గెలిపించేందుకు చివరిదాకా ఒంటరిపోరాటం చేశాడు. మిడిలార్డర్ విఫలమైనా టెయిలెండర్ల సాయంతో జడ్డూ గెలుపు ఆశలు రేపాడు. బుమ్రా, సిరాజ్ అతడికి అండగా నిలిచినా అదృష్టం మాత్రం ఇంగ్లిష్ జట్టు వైపే నిలిచింది. ఇంగ్లండ్ బౌలర్లలో కెప్టెన్ స్టోక్స్ (3/48), ఆర్చర్ (3/55) తలా మూడు వికెట్లు తీయగా కార్స్ (2/30) రెండు వికెట్లు పడగొట్టాడు. స్టోక్స్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరుజట్ల మధ్య నాలుగో టెస్టు నెల 23న మాంచెస్టర్ వేదికగా జరుగనుంది.
దెబ్బకొట్టిన ఆర్చర్, స్టోక్స్
లార్డ్స్‌లో విజయానికి 135 పరుగుల దూరంలో ఉండగా ఐదో రోజు ఆట (ఓవర్‌నైట్ స్కోరు 58/4) ప్రారంభించిన టీమ్ఇండియాకు ఆరంభంలోనే కోలుకోలేని ఎదురుదెబ్బలు తగిలాయి. నాలుగు ఓవర్ల వ్యవధిలో గిల్ సేన మూడు కీలక వికెట్లు కోల్పోయింది. మొదట ఆర్చర్.. భారత్ గంపెడాశలు పెట్టుకున్న రిషభ్ పంత్ (9)ను తన రెండో ఓవర్లో క్లీన్‌బౌల్డ్ చేశాడు. రాహుల్ (39)ను స్టోక్స్ వికెట్ల ముందు బలిగొన్నాడు. ఆ మరుసటి ఓవర్లోనే వాషింగ్టన్.. ఆర్చర్ బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో భారత్ కష్టాలు రెట్టింపయ్యాయి.
జడ్డూ పోరాటం
82 పరుగులకే 7 కీలక వికెట్లు కోల్పోయిన క్రమంలో జడేజా.. జట్టు గెలుపు బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు. నితీశ్‌కుమార్ రెడ్డి (13)తో అతడు 8వ వికెట్‌కు 91 బంతుల్లో 30 పరుగులు జోడించాడు. 15 ఓవర్ల పాటు ఇంగ్లిష్ బౌలర్లను నిలువరించిన ఈ జోడీని లంచ్ విరామానికి ఒక్క ఓవర్ ముందు వోక్స్ విడదీశాడు. ఈ స్థితిలో భారత్ కథ ముగిసిందనే అనుకున్నారంతా! కానీ జడ్డూ మాత్రం పోరాటాన్ని ఆపలేదు. బుమ్రా (54 బంతుల్లో 5) తో కలిసి పోరు కొనసాగించాడు. తన అనుభవన్నంతా రంగరిస్తూ.. ఇంగ్లిష్ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టాడు. ఓవర్‌కు ఒక్కో పరుగును కూడదీసుకుంటూ జడేజా ఆడిన ఇన్నింగ్స్ 2019 వన్డే వరల్డ్ కప్ సెమీస్‌లో న్యూజిలాండ్‌పై ఆడిన చరిత్రాత్మక ఇన్నింగ్స్‌ను గుర్తుచేసింది. ఇంగ్లండ్ కెప్టెన్ పదే పదే బౌలర్లను మార్చినా.. ఏకంగా తనే రంగంలోకి దిగి వరుసపెట్టి 13 ఓవర్లు వేసినా ఈ జోడీ చిన్న తప్పు కూడా చేయలేదు. నితీశ్ ఔట్ అయినప్పుడు భారత విజయానికి 81 పరుగులు అవసరం కాగా.. ఆ లక్ష్యాన్ని జడ్డూ కరుగదీసుకుంటూ 25కు తీసుకొచ్చాడు.
దాదాపు రెండో సెషన్ మొత్తం బ్యాటింగ్ చేసిన జడ్డూ, బుమ్రా ద్వయాన్ని టీ విరామానికి కొద్దిసేపు ముందు స్టోక్స్ విడదీశాడు. అతడు వేసిన షార్ట్ బాల్‌ను ఆడబోయిన బుమ్రా.. మిడాన్ వద్ద కుక్కు క్యాచ్ ఇవ్వడంతో 35 పరుగుల (132 బంతుల్లో) 9వ వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత సిరాజ్ కూడా పోరాటాన్ని ఆపలేదు. జడేజాకు పూర్తి సహకారం అందిస్తూ (30 బంతుల్లో 4) భారత జట్టును గెలుపు దిశగా తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేశాడు. 13 ఓవర్ల పాటు క్రీజులో నిలిచిన సిరాజ్‌ను ఔట్ చేసేందుకు స్టోక్స్.. అతడికి దగ్గరగా ఫీల్డర్లను మొహరించినా పట్టుదల కోల్పోకుండా ఆడటం విశేషం. కానీ టీ విరామం తర్వాత స్పిన్నర్ బషీర్‌కు బంతినిచ్చిన స్టోక్స్.. ఫలితాన్ని రాబట్టాడు. అతడు వేసిన 75వ ఓవర్లో బంతిని సిరాజ్ డిఫెండ్ చేసినా అతడి కాలి వెనుక నుంచి వెళ్లిన బాల్.. వికెట్లను తాకడంతో బెయిల్స్ కిందపడ్డాయి. అంతే..! భారత అభిమానుల గుండె పగలిన క్షణమది!!
మార్వాడి స్టాలియన్!
రవీంద్రసిన్హ్ అనిరుధ్‌సిన్హ్ జడేజా..అలియాస్ జడేజా! పరిచయం అక్కరలేని పేరు. భారత్‌కు దొరికిన నిఖార్సైన ఆల్‌రౌండర్. ఫార్మాట్ ఏదైనా అటు బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు కండ్లు చెదిరే ఫీల్డింగ్‌తో జట్టుకు ఆయువుపట్టులా నిలుస్తూనే ఉన్నాడు. 2009లో కొలంబోలో శ్రీలంకపై వన్డేల్లో అరంగేట్రం చేసినప్పటి నుంచి ఇంగ్లండ్‌తో తాజాగా లార్డ్స్ టెస్టు వరకు టీమ్ఇండియా చిరస్మరణీయ విజయాల్లో జడేజాది అలుపెరుగని పోరాటం. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయని ఈ దిగ్గజ ఆల్‌రౌండర్ అసమాన ప్రతిభతో ముందుకు సాగుతున్నాడు. దిగ్గజ త్రయం విరాట్‌కోహ్లీ, రోహిత్‌శర్మ, అశ్విన్ నిష్ర్కమణ తర్వాత జట్టుకు పెద్దదిక్కుగా మారిన జడేజా తన విలువేంటో మరోమారు చాటుకున్నాడు. బంతికి బంతికి పరీక్ష పెడుతున్న లార్డ్స్ పిచ్‌పై ఇంగ్లండ్ బౌలింగ్‌కు ఎదురొడ్డి నిలుస్తూ అతను సాగించిన ఒంటరిపోరాటం చరిత్రలో నిలిచిపోతుంది. సహచర బ్యాటర్లు ఒక్కొక్కరు కాడి పడేస్తున్న వేళ పోరాటాన్ని అణువణువున నింపుకున్న ఈ సౌరాష్ట్ర మేరునగధీరుడు కొట్లాడిన తీరు నభూత్ నభవిష్యత్.
ఆల్‌రౌండర్ స్థానానికి సార్థకత చేకూరుస్తూ ఆఖరి వరుస బ్యాటర్లతో కలిసి జడేజా పోరాడిన తీరు విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నది. స్టోక్స్, ఆర్చర్, వోక్స్, కార్స్ విసిరిన బుల్లెట్ లాంటి బంతులను కాచుకుంటూ బౌలర్లు బుమ్రా, సిరాజ్‌తో కలిసి జడేజా జట్టును గెలిపించేందుకు ప్రయత్నించిన వైనం అభిమానులను కట్టిపడేసింది. సీన్ కట్ చేస్తే సరిగ్గా ఆరేండ్ల క్రితం 2019 న్యూజిలాండ్‌తో సెమీఫైనల్లో జడేజా వారియర్‌లా వీరోచితంగా పోరాడిన సందర్భం మదిలో మెదులుతున్నది. 240 పరుగుల లక్ష్యఛేదనలో టాప్-3 బ్యాటర్లు రాహుల్ (1), రోహిత్‌శర్మ (1), కోహీ ్ల(1) ఘోరంగా విఫలమైన వేళ గెలుపు ఆశలు మిణుకు మిణుకుమంటున్న సమయాన తాను ఉన్నానంటూ 77 పరుగులతో జడేజా టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. అచ్చం లార్డ్స్ టెస్టును తలపిస్తూ ఆనా డు మాంచెస్టర్‌లో విజ యం కోసం జడేజా ఆఖరిదాకా పోరాడాడు. ఈ రెండు సందర్భాల్లోనూ భారత అభిమాని గుండె బద్దలైనా జడేజా పోరాడిన తీరు కలకాలం గుర్తుండిపోతుంది. తన బ్యాట్‌పై గుర్రపు బొమ్మతో కనిపించే ‘మార్వాడి స్టాలియన్’ పేరు జడేజాకు అతికినట్లు సరిపోతుందనడంలో ఎలాం టి అతిశయోక్తి లేదేమో!
పరుగుల పరంగా అతి తక్కువ మార్జిన్‌తో ఓడటం భారత్‌కు ఇది నాలుగోసారి. గతంలో పాకిస్థాన్ (1998లో 12 రన్స్), ఆస్ట్రేలియా (1977లో 16 రన్స్), 1987లో పాక్‌పై 16 రన్స్ తేడాతో ఓడింది.
సంక్షిప్త స్కోర్లు
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 387; భారత్ తొలి ఇన్నింగ్స్: 387; ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 192; భారత్ రెండో ఇన్నింగ్స్: 170 ఆలౌట్ (జడేజా 61, కేఎల్ రాహుల్ 39, స్టోక్స్ 3/48, ఆర్చర్ 3/55)