మాంచెస్టర్: భారీ అంచనాల మధ్య 15 ఏండ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్లో అడుగు పెట్టిన మ్యాచ్‌లో భారత్ బోల్తా కొట్టింది. స్పిన్నర్ రవి బిష్ణోయ్ చెత్త బౌలింగ్ కారణంగా ఇంగ్లండ్ టూర్‌ను ఓటమితో ఆరంభించింది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా శనివారం రాత్రి జరిగిన రెండో మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. భారత్ ఇచ్చిన 191 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లిష్ టీమ్ 19 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. జాకబ్ బెథెల్ (46 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 76 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్‌తో ఆ జట్టును గెలిపించాడు. అర్ష్‌దీప్ సింగ్ (3/40) పోరాటం వృథా అయింది. టాస్ ఓడిన భారత్ తొలుత 190/7 స్కోరు చేసింది. ఇషాన్ (49), అభిషేక్ (24 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌తో 43), కెప్టెన్ శ్రేయస్ (37) రాణించారు. బెథెల్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. మూడో టీ20 మంగళవారం జరుగుతుంది.
సంజూ శాంసన్ స్థానంలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన సూర్యవంశీ ఆర్చర్ మెరుపు వేగంతో వేసిన బాల్‌ను స్కూప్ షాట్‌తో సిక్స్, టంగ్ ఓవర్లో మరో సిక్స్‌తో అలరించి విల్ జాక్స్ బౌలింగ్‌లో స్టంపౌటయ్యాడు. మరో ఓపెనర్ అభిషేక్ పవర్‌ప్లేలో భారీ షాట్లు కొట్టాడు. కరన్ వేసిన ఆరో ఓవర్లో మూడో ఫోర్లు బాది ఆఖరి బాల్‌కు ఔటయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన ఇషాన్, శ్రేయస్ అడపాదడపా బౌండరీలు కొడుతూ మూడో వికెట్‌కు 65 పరుగులు జోడించారు. సామ్ కరన్ (3/33) బౌలింగ్‌లో ఇషాన్, హిట్టర్ శివం దూబే (5) ఔటవగా.. ఆల్‌రౌండర్ అక్షర్ (2) రనౌటయ్యాడు. కానీ, ఆర్చర్ వేసిన ఆఖరి ఓవర్లో తిలక్ వర్మ (24 నాటౌట్) 6, 6,4 సహా 17 పరుగులు స్కోరును 190కి చేర్చాడు.
లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్‌ను తొలి ఓవర్లోనే ఫిల్ సాల్ట్ (0), జోస్ బట్లర్ (0)ను గోల్డెన్ డకౌట్స్ చేసిన భారత పేసర్ అర్ష్‌దీప్ దెబ్బకొట్టాడు. కానీ, కెప్టెన్ హ్యారీ బూక్ (15 బంతుల్లో 39).. అర్ష్‌దీప్ వేసిన మూడోఓవర్లో వరుసగా 4,4,6,6,6తో 27 రన్స్ పిండుకొని కౌంటర్ ఎటాక్‌కు దిగాడు. కానీ ఐదో ఓవర్లో అక్షర్ బాల్‌ను వెంటాడిన బ్రూక్.. కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. స్పిన్నర్ల బౌలింగ్‌లో కాసేపు జాగ్రత్త పడ్డ టామ్ బాంటన్ (39), బెథెల్, చక్రవర్తి వేసిన పదో ఓవర్లో 6, 4తో ఒక్కసారిగా గేరు మార్చి భారీ షాట్లు కొట్టారు. 24 బంతుల్లో 49 రన్స్ అవసరమైన దశలో కెప్టెన్ శ్రేయస్ 17వ ఓవర్లో స్పిన్నర్ బిష్ణోయ్‌ను బౌలింగ్‌కు దింపడం కొంపముంచింది. రెండు నోబాల్స్ సహా బిష్ణోయ్ వేసిన చెత్త బంతులకు బెథెల్ 3 సిక్సర్లు, ఓ ఫోర్ సహా 29 పరుగులు రాబట్టి ఇంగ్లండ్ విజయం ఖాయం చేశాడు.
భారత్: 20 ఓవర్లలో 190/7 (ఇషాన్ 49, అభిషేక్ 43, కరన్ 3/33).
ఇంగ్లండ్: 19 ఓవర్లలో 191/6 (బెథెల్ 76 నాటౌట్, బ్రూక్ 39, అర్ష్‌దీప్ 3/40).