లండన్: ఆధిక్యం చేతులు మారుతూ సాగిన పోరులో ఆస్ట్రేలియాను విజయం వరించింది. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (155; 9 ఫోర్లు, 9 సిక్సర్లు) వీరోచితంగా పోరాడినా.. తన జట్టును గెలుపు గీత దాటించలేకపోయాడు. 371 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్‌నైట్ స్కోరు 114/4తో ఆదివారం ఐదో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్.. చివరకు 327 పరుగులకు ఆలౌటై 43 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. బెన్ డకెట్ (83) రాణించాడు.
ఒక దశలో 301/6తో పటిష్ట స్థితిలో నిలిచిన ఇంగ్లండ్.. బెన్ స్టోక్స్ ఔట్ అవడంతో లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, కమిన్స్, హజిల్‌వుడ్ తలా మూడు వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగిన స్టీవ్ స్మిత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.