James Anderson | లండన్: టెస్టుల్లో ఒక శకం ముగిసింది! తన అద్భుతమైన స్వింగ్ బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టించిన ఇంగ్లండ్ స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్ ఆటకు వీడ్కోలు పలికాడు. తన రెండు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌కు గుడ్‌బై చెబుతూ క్రికెట్ మక్కాగా పేరొందిన లార్డ్స్ మైదానంలో ఆఖరి ఆట ఆడేశాడు. వెస్టిండీస్‌తో మూడు రోజుల్లోనే ముగిసిన తొలి టెస్టు ద్వారా ఈ స్టార్ పేసర్ అభిమానులు, సహచరుల సమక్షం అల్విదా చెప్పేశాడు. 2003లో లార్డ్స్‌లో జింబాబ్వేపై టెస్టుల్లో అరంగేట్రం చేసిన అండర్సన్ 188 మ్యాచ్‌ల్లో 26.45 సగటుతో 704 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. దీని ద్వారా ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో ఏ పేస్ బౌలర్‌కు దక్కని అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.
ఇన్‌స్వింగ్, ఔట్‌స్వింగ్, రివర్స్ స్వింగ్ ఇలా బంతిని తన చేతివేళ్లతో అద్భుతం చేస్తూ లెక్కకు మిక్కిలి రికార్డులను సొంతం చేసుకున్నాడు. సచిన్, గంగూలీ, పాంటింగ్, ద్రవిడ్, లక్ష్మణ్, లారా, గిల్‌క్రిస్ట్, కలిస్ లాంటి ప్రపంచస్థాయి బ్యాటర్లను తన స్వింగ్ బౌలింగ్‌తో ముప్పుతిప్పలు పెట్టాడు. ముఖ్యంగా ఇంగ్లండ్‌లో డ్యూక్ బంతులను అండర్సన్ సంధించే తీరు చూస్తే ఎవరికైనా ఆహా అద్భుతం అనిపించకపోదు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మురళీధరన్ (800), వార్న్ (708) తర్వాత అండర్సన్ (704) మూడో స్థానంలో నిలిచాడు.
ఇంగ్లండ్ ఘన విజయం: వెస్టిండీస్‌తో తొలి టెస్టులో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 114 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 79/6 మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌కు దిగిన విండీస్..136 పరుగులకు ఆలౌటైంది. అట్కిన్సన్(5/61), అండర్సన్(3/32) విజృంభించారు. 12 వికెట్లు పడగొట్టిన అట్కిన్సన్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.