England : ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్(ODI World Cup 2023)లో ఇంగ్లండ్(England) జట్టు డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది. అయితే.. 2019 ప్రపంచ కప్ హీరోలు బెన్ స్టోక్స్(Ben Stokes), జోఫ్రా ఆర్చర్(Jofra Archer) ఈ మెగా టోర్నీకి అందుబాటులో ఉండడంపై స్పష్టత రాకపోవడం ఇంగ్లండ్‌ను వేధిస్తోంది. మెగా టోర్నమెంట్ లోపు స్టోక్స్ వన్డే ఫార్మాట్ రిటైర్మెంట్ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని, గాయం నుంచి కోలుకుంటున్న ఆర్చర్ ఫిట్నెస్ సాధించాలని కోరుకుంటున్నామని వన్డే జట్టు కోచ్ మాథ్యూ మాట్(Matthew Mott) ఈరోజు వెల్లడించాడు.
ఈ ఏడాది జూలైలో స్టోక్స్ వన్డేలకు గుడ్ బై చెప్పాడు. భారత్‌తో 2024లో జరిగే టెస్టు సిరీస్ కోసమని అతను 50 ఓవర్ల ఆటకు దూరంగా ఉండాలనుకుంటున్నాడు. అయితే.. ఈ మధ్యే ముగిసిన యాషెస్ సిరీస్(Ashes Series)లో స్టోక్స్ అద్భుతంగా రాణించాడు. ‘మంచి ఫామ్‌లో ఉన్న అతను ప్రపంచ కప్‌లో ఆడాల్సిందిగా కోరుతున్నాం. ఇక జోఫ్రా ఆర్చర్ విషయంలో మేము రిస్క్ తీసుకోవాలని అనుకుంటున్నాం. అయితే.. అతడిని అన్ని మ్యాచుల్లో కాకుండా ముఖ్యమైన వాటిలోనే ఆడిస్తాం. మరో విషయం ఏంటంటే.. యాషెస్ సిరీస్‌లో నిప్పులు చెరిగిన మార్క్ వుడ్(Mark Wood) కూడా మా ప్రధాన బౌలర్’ అని మ్యాట్ వెల్లడించాడు.
జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్
న్యూజిలాండ్‌తో లార్డ్స్‌లో జరిగిన 2019 ప్రపంచ కప్ ఫైనల్లో బెన్ స్టోక్స్ వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. 84పరుగులతో నాటౌట్‌గా నిలిచి మ్యాచ్‌ను సూపర్ ఓవర్(Super Over) వరకు తీసుకెళ్లాడు. సూపర్ ఓవర్లో జోఫ్రా ఆర్చర్ కివీస్ బ్యాటర్లను కట్టడి చేయడంతో ఇంగ్లండ్ మొదటిసారి వన్డే చాంపియన్‌గా అవతరించింది. అయితే.. ఆ తర్వాత న్యూజిలాండ్ సిరీస్‌లో మోకాలి గాయం కారణంగా స్టోక్స్ కొన్ని రోజులు ఆటకు దూరమయ్యాడు.
వరల్డ్ కప్ ట్రోఫీతో బెన్ స్టోక్స్
ఐపీఎల్ 16వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) తరఫున మూడు మ్యాచ్‌లే ఆడాడు. మరోవైపు స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఇంకా ఫిట్నెస్ సాధించలేదు. కీలకమైన ఈ ఇద్దరూ వరల్డ్ కప్‌లో ఆడతారా? లేదా? అనేది త్వరలోనే తెలియనుంది. ఈ ఏడాది అక్టోబర్ 5న భారత్‌లో ప్రపంచ కప్ మొదలవ్వనుంది. తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ ఢీ కొననున్నాయి.