ENG vs WI : ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ (James Anderson)కు ఘనమైన వీడ్కోలు లభించింది. సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరిగిన లార్డ్స్ టెస్టులో బెన్ స్టోక్స్ సేన ఇన్నింగ్స్ 114 పరుగుల తేడాతో గెలుపొందింది. దాంతో, బౌలింగ్ దిగ్గజం అండర్సన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి సెలవు తీసుకున్నాడు.
ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి కరీబియన్ ఆటగాళ్లు క్రీజులో నిలవలేకపోయారు. దాంతో, మూడో రోజు ఆట మొదలైన కాసేపటికే కరీబియన్ జట్టు ఆలౌటయ్యింది. అరంగేట్రం మ్యాచ్‌లోనే అదరగొట్టిన పేసర్ గట్ అట్కిన్సన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యాడు.
One last time 🥲 pic.twitter.com/2G7svl9Q7K
— England Cricket (@englandcricket) July 12, 2024
లార్డ్స్ టెస్టులో తొలి రోజు నుంచే ఇంగ్లండ్ పట్టు బిగించింది. మొదటి రోజే అట్కిన్సన్ విజృంభణతో కరీబియన్ బ్యాటర్లు చేతులెత్తేశారు. అలిక్ అథనెజె 24 పరుగులతో టాప్ స్కోరర్ కాగా 121కే విండీస్ ఆలౌటయ్యింది. అనంతరం ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ 371 పరుగుల భారీ స్కోర్ చేసింది.

వెస్టిండీస్ బౌలర్లను ఉతికేస్తే ఏకంగా ఐదుగురు అర్ధ శతకాలతో కదం తొక్కారు. ఓపెనర్ జాక్ క్రాలే(76), జో రూట్(68), ఓలీ పోప్(57), హ్యారీ బ్రూక్(50)లు ‘బజ్‌బాల్’ ఆటతో చెలరేగారు. జేమీ స్మిత్(70) సైతం అద్భుత అర్ధ శతకంతో జట్టు స్కోర్ 370 దాటించాడు. దాంతో, తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌కు ఆధిక్యం లభించింది.
వెస్టిండీస్ జట్టు 250 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించింది. అయితే.. వీడ్కోలు మ్యాచ్ ఆడుతున్న అండర్సన్ (3/32)ఓపెనర్ క్రెగ్ బ్రాత్‌వైట్(4)ను బౌల్డ్ చేసి వికెట్ల వేట మొదలెట్టాడు. ఆ తర్వాత అట్కిన్సన్(5/61), కెప్టెన్ బెన్ స్టోక్స్(2/25)లు విండీస్‌ను వణికించారు. జేసన్ హోల్డర్ (20) ఔట్ కావడంతో పర్యాటక జట్టు కోలుకోలేకపోయింది. 136 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. దాంతో, ఇంగ్లండ్ 114 పరుగుల తేడాతో భారీ విజయం నమోదు చేసింది.
Jimmy Anderson at his 𝘃𝗲𝗿𝘆 best ✨#EnglandCricket | @Jimmy9 pic.twitter.com/98i7Uythss
— England Cricket (@englandcricket) July 12, 2024