ODI Highest Victory : వన్డే ఫార్మాట్లో అతిపెద్ద విజయంతో ఇంగ్లండ్ చరిత్ర సృష్టించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో 342 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. తద్వారా వన్డేల్లో పరుగుల పరంగా అతిపెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది ఇంగ్లండ్. గతంలో భారత జట్టు పేరిట ఉన్న రికార్డును బద్ధలు కొట్టింది హ్యారీబ్రూక్ సేన. శ్రీలంకపై 317 పరుగులతో గెలుపొందింది.
సౌతాంప్టన్ మైదానంలో తొలుత జాకబ్ బెథెల్(110), జో రూట్ (100) సెంచరీలకు జోస్ బట్లర్ (62 నాటౌట్), జేమీ స్మిత్(62) అర్ధ శతకాలు తోడవ్వడంతో 414 రన్స్ కొట్టింది ఇంగ్లండ్. అనంతరం పేసర్ జోఫ్రా ఆర్చర్ (4-18) ధాటికి సఫారీ జట్టు 72కే కుప్పకూలి దారుణ ఓటమి మూటగట్టుకుంది.
THE BIGGEST-EVER MARGIN OF WIN IN AN ODI BY RUNS!
🔗 https://t.co/hboolAQas4 pic.twitter.com/6srWXt4UzB
— ESPNcricinfo (@ESPNcricinfo) September 7, 2025
నామమాత్రమైన మూడో వన్డేలో ఇంగ్లండ్ బ్యాటర్లు దక్షిణాఫ్రికా బౌలర్లను ఊచకోత కోశారు. బౌండరీల మోతతో జట్టు స్కోర్ నాలుగొందలు దాటించారు. కుర్రాడు జాకబ్ బెథెల్(110), జో రూట్ (100), శతకాలతో భారీ స్కోర్‌కు పునాది వేయగా.. మాజీ కెప్టెన్ జోస్ బట్లర్ (62 నాటౌట్) సైతం దంచేశాడు. దాంతో.. నిర్ణీత ఓవర్లలో ఇంగ్లండ్ 5 వికెట్ల నష్టానికి 414 రన్స్ చేసింది. ఈ ఫార్మాట్లో ఆ జట్టు 400 ప్లస్ చేయడం ఇది ఏడోసారి. తద్వారా టీమిండియా రికార్డును సమం చేసింది ఇంగ్లీష్ టీమ్.
అనంతరం భారీ ఛేదనకు దిగిన సఫారీలకు జోఫ్రా ఆర్చర్ (4-18) తొలి ఓవర్లోనే షాకిచ్చాడు. ఓపెనర్ ఎడెన్ మర్క్రమ్(0)ను డకౌట్ చేసి ఒత్తిడిలోకి నెట్టాడు. రియాన్ రికెల్టన్ను వెనక్కి పంపి సఫారీల పతనాన్ని శాసించాడు. ఆర్చర్ విజృంభణకు.. కార్సే, ఆదిల్ రషీద్ తోడవ్వగా.. క్రీజులోకి వచ్చినవాళ్లు వచ్చినట్టు పెవిలియన్ చేరారు. దాంతో. 20.5 ఓవర్లలోనే 72 పరుగులకే తెంబా బవుమా బృందం కుప్పకూలింది.