ముంబై: నిబంధనలకు విరుద్ధంగా ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రసారం చేసిన సంస్థపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడులకు దిగింది. హక్కులు దక్కించుకున్న సంస్థ కాకుండా ఐపీఎల్ మ్యాచ్‌లను ‘ఫెయిర్‌ప్లే’ యాప్ ద్వారా ప్రసారం చేయడంతో పాటు బెట్టింగ్‌కు పాల్పడిన వాటిపై ఈడీ తాజాగా చర్యలకు దిగింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్(పీఎమ్ఎల్ఏ) యాక్ట్ కింద గురువారం ముంబై, పుణెలో 19 చోట్ల ఒకేసారి జరిగిన ఈ దాడుల్లో దాదాపు ఎనిమిది కోట్ల విలువైన నగదు, ఖరీదైన వాచ్‌లు, డీమ్యాట్ అకౌంట్ పత్రాలను జప్తు చేసింది.
విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఐపీఎల్ మ్యాచ్‌లను అనధికారికంగా ప్రచారం చేయడానికి ఫెయిర్‌ప్లే దుబాయ్, కురకావోలోని షెల్ కంపెనీల ద్వారా భారత్‌లో అక్రమంగా పెట్టుబడులు పెట్టినట్లు తేలింది. ఇందుకోసం ఏకంగా 400కు పైగా బ్యాంక్ అకౌంట్లను ఫెయిర్‌ప్లే వినియోగించినట్లు దర్యాప్తులో బయటపడింది. ఐపీఎల్ అధికారిక ప్రసారుదారైన వయాకామ్..ముంబైలో చేసిన ఫిర్యాదుతో ఈడీ రంగంలోకి దిగడంతో ఈ బండారం బయటపడింది.