హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ) : ఉప్పల్ స్టేడియం నిధుల అక్రమాల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ఈనెల 8న హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్ను విచారించిన ఈడీ అధికారులు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా గురువారం మూడు సంస్థలకు నోటీసులు ఇచ్చారు.
వీటిల్లో బాడీడ్రెంచ్ ఇండియా, సర స్పోర్ట్స్, ఎక్స్లెంట్ ఎంటర్ప్రైజెస్ సంస్థలు ఉన్నాయి. వీటికి సంబంధించిన నిర్వాహకులు ఈనెల 22న ఈడీ ముందు ప్రత్యక్షంగా హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. జనరేటర్స్, జిమ్ పరికరాలు, క్రికెట్ బాల్స్, ఇతర వస్తువుల కొనుగోలుకు సంబంధించి ఈడీ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే.