ఢిల్లీ : భారత మాజీ క్రికెటర్లు సురేశ్ రైనా, శిఖర్ ధవన్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాకిచ్చింది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ (1XBet) ప్రమోషన్ కేసులో ఈ ఇద్దరికి సంబంధించిన రూ. 11.14 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ యాప్‌నకు సంబంధించి మనీ లాండరింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న ఈడీ..ధవన్‌కు చెందిన రూ. 4.5 కోట్ల స్థిరాస్తి, రైనా రూ. 6.64 కోట్ల విలువైన మ్యూచుఫల్ ఫండ్స్‌ను అటాచ్ చేసినట్టు వెల్లడించాయి.
రైనా, ధవన్ అన్నీ తెలిసే ఈ యాప్ అనుబంధ సంస్థల ప్రమోషన్ కోసం విదేశీ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నట్టు ఈడీ గుర్తించినట్టు తెలుస్తున్నది. ఈ ఇద్దరితో పాటు గతంలో యువరాజ్ సింగ్, రాబిన్ ఊతప్ప, నటులు సోనూ సూద్, ఊర్వశి రౌతేలా, మిమి చక్రవర్తినీ ఈడీ విచారించిన విషయం విదితమే.