ECB : భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటన ఖరారైనప్పటి నుంచి పటౌడీ ట్రోఫీ (Pataudi Trophy) గురించి చర్చ కొనసాగుతోంది. అందుకు కారణం ఈ ఏడాది నుంచి ఇరుదేశాల దిగ్గజాలు సచిన్ (Sachin)- అండర్సన్ (Anderson) పేర్లతో ట్రోఫీ నిర్వహిస్తామని ఇంగ్లండ్ ప్రకటించడమే. ఈ నేపథ్యలో భారత లెజెండరీ ఆటగాళ్లు సునీల్ గవాస్కర్, బీసీసీఐ పెద్దలు పటౌడీ పేరు మార్చవద్దని ఈసీబీకి విన్నవించారు. సచిన్ టెండూల్కర్ (Sachin Tendlukar), ఐసీసీ ఛైర్మన్ జై షాలు సైతం ఆనవాయితీ ప్రకారం ఆయన పేరుతో ట్రోఫీ జరపాలని సూచించారు. ఈ ఇద్దరి విజ్ఞప్తితో దిగొచ్చిన ఇంగ్లండ్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.
‘ఈ ఏడాది నుంచి భారత్, ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌ను పటౌడీ పేరుతో కాకుండా సచిన్ – అండర్సన్ ట్రోఫీగా నిర్వహించాలని ఈసీబీ నిర్ణయించింది. అయితే.. అలా చేయడం దిగ్గజ ఆటగాడైన పటౌడీని అగౌరపరచడమేనంటూ పలువురు భారత క్రికెటర్లు మండిపడ్డారు. తన పేరుతో ట్రోఫీ జరపాలనుకుంటున్న ఈసీబీకి టెండూల్కర్ ప్రత్యేక విన్నపం చేశాడు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఇరుదేశాల సిరీస్‌లో పటౌడీ పేరు ఉండేలా చూడాలని కోరాడు. దాంతో, సానుకూలంగా స్పందించిన ఈసీబీ.. విన్నింగ్ కెప్టెన్‌కు ‘పటౌడీ మెడల్’ను కానుకగా ఇస్తామని తెలిపింది’ అని మంగళవారం బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది.
సచిన్ – అండర్సన్
భారత్, ఇంగ్లండ్‌ల మధ్య తొలి టెస్టు సిరీస్‌కు 2007లో 75 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా ఇరుదేశాల బోర్డులు ఇంగ్లండ్‌లో జరుగబోయే సిరీస్‌ను మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ పేరుతో నిర్వహించాలని నిర్ణయించాయి. అప్పటినుంచి 2024 వరకూ పటౌడీ పేరుతోనే ట్రోఫీని జరిపారు. అయితే.. నిరుడు జేమ్స్ అండర్సన్ వీడ్కోలు పలకడంతో అతడిని గౌరవించాలనుకుంది ఈసీబీ. అందుకే.. పటౌడీ ట్రోఫీకి మంగళం పాడి.. భారత లెజెండ్ సచిన్ టెండూల్కర్ పేరును జతచేసింది. ఈ ఏడాది నుంచి సచిన్ – అండర్సన్ ట్రోఫీ నిర్వహిస్తామని ఇంగ్లండ్ బోర్డు తెలిపింది.
పటౌడీ, ట్రోఫీతో ద్రవిడ్ సంబురాలు..
జూన్ 20 నుంచి భారత్, ఇంగ్లండ్‌ల మధ్య తొలి టెస్టు జరుగనుంది. అంతకంటే ముందే సచిన్ అండర్సన్ ట్రోఫీని ఆవిష్కరించాలని ఈసీబీ భావించింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ సందర్భంగా లార్డ్స్ మైదానంలో ట్రోఫీ ఆవిష్కరణ వేడుక జరిపేందుకు ఏర్పాట్లు కూడా చేసింది. కానీ, జూన్ 12న అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం అనంతరం భారత క్రికెటర్లు విషాదంలో మునిగిపోయారు. దాంతో, ట్రోఫీ కార్యక్రమాన్ని వాయిదా వేసింది ఈసీబీ. ఇరుబోర్డులకు ఆమోదయోగ్యమైన రోజున అంటే జూన్ 19న ఆవిష్కరణకు సిద్ధమవుతోంది ఇంగ్లండ్ బోర్డు.