దామరచర్ల, జూన్ 17 : ఆధునిక బోధనా పద్ధతులపై ఉపాధ్యాయులు దృష్టి సారించాలని నల్లగొండ జిల్లా విద్యాధికారి బొల్లారం భిక్షపతి అన్నారు. దామరచర్ల మండలంలోని దామరచర్ల, దిలావర్పూర్ పాఠశాలలు, ఇంద్రానగర్ భవిత కేందాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీరియడ్ ప్రణాళిక బోధనోపకరణాలను ఉపయోగించే విధానాన్ని పరిశీలించి, ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో విద్యార్థుల నమోదు నిరంతరం నిర్వహించాలన్నారు. పాఠశాలలకు హాజరైన విద్యార్థులకు అభ్యసన వాతావరణం వైపు మళ్లించుటకు భాషా కృత్యాలు, గణిత కృత్యాలతో పాటు కథలు చెప్పించడం, డిజిటల్ తరగతులు నిర్వహించడం వంటి కృత్యాలు చేయించి పాఠశాల వైపు ఆకర్షితులను చేయాలన్నారు.
ఉపాధ్యాయ శిక్షణలో నేర్చుకున్న అన్ని అంశాలు ప్రతి ఉపాధ్యాయుడు తరగతి గదిలో అమలు పరచాలన్నారు. మధ్యాహ్న భోజన మెనూ విధిగా అమలు పరచాలని, వారానికి మూడుసార్లు గుడ్లు అందించాలని ఆదేశించారు. పలు పాఠశాలలకు యూనిఫామ్స్ అందనందున సంబంధిత అధికారులను మందలించారు. భవిత కేంద్రం ఆధునీకరణ పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలందరూ భవితా కేంద్రంలో కృత్యాధార బోధన ద్వారా విలీన విద్య పొందాలని, ప్రతివారం ఫిజియోథెరపీ క్యాంప్ నిర్వహించి తల్లిదండ్రులు ఇంటి వద్దే నిర్వహించే విధంగా తర్ఫీదు ఇవ్వాలని పేర్కొన్నారు. డీఈఓ వెంట ఎంఈఓ ఎం.బాలాజీ నాయక్, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం కేతావత్ సైదానాయక్, బండా వెంకట్రెడ్డి, శ్రీనివాస్, గోవర్ధన్ రెడ్డి, వీరయ్య, రవి, లక్ష్మమ్మ ఉన్నారు.
Damaracharla : ఆధునిక బోధనలపై ఉపాధ్యాయులు దృష్టి సారించాలి : డీఈఓ భిక్షపతి