ఢిల్లీ : అనుకున్నదే అయింది! కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ యాక్ట్’.. భారత క్రికెట్ జట్టుకు టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న ‘డ్రీమ్ 11’ సంస్థకు షాకిచ్చింది. ఆన్లైన్ ఫాంటసీ స్పోర్ట్స్, గ్యాంబ్లింగ్ వేదికలపై ప్రభుత్వం నిషేధం విధించిన నేపథ్యంలో డ్రీమ్ 11తో తమ బంధాన్ని తెంచుకుంటున్నట్టు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారికంగా తెలిపింది. 2023లో మూడేండ్ల కాలానికి గాను బీసీసీఐతో రూ. 358 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకున్న డ్రీమ్ 11.. ఇకపై స్పాన్సర్‌గా వ్యవహరించదు. మరికొద్దిరోజుల్లో ప్రతిష్టాత్మక ఆసియా కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో బీసీసీఐ ఈ అనూహ్య నిర్ణయం తీసుకోవడం గమనార్హం. డ్రీమ్ 11 ఒప్పందం రద్దుతో ఐపీఎల్లో ఫాంటసీ స్పోర్ట్స్ పార్ట్నర్గా ఉన్న ‘మై 11 సర్కిల్’కూ తిప్పలు తప్పేలా లేవు. మై 11 సర్కిల్ ఐదేండ్ల కాలానికి గాను బీసీసీఐతో రూ. 625 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకున్న విషయం విదితమే.
డ్రీమ్ 11తో ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు బీసీసీఐ కార్యదర్శి దేవ్జిత్ సైకియా సోమవారం ఒక వార్తా ఛానెల్‌తో మాట్లాడుతూ వెల్లడించారు. ఆయన స్పందిస్తూ.. ‘మా వైఖరి సుస్పష్టంగా ఉంది. ప్రభుత్వ నిబంధనలు అమల్లో ఉన్నందున డ్రీమ్ 11తో గానీ ఆన్లైన్ గేమింగ్ కంపెనీతో మేం ఎలాంటి స్పాన్సర్షిప్ సంబంధాలనూ కొనసాగించబోము. కొత్త స్పాన్సర్ల కోసం ప్రక్రియ మొదలైంది. అది పూర్తికాగానే మీడియాకు వివరాలు వెల్లడిస్తాం’ అని చెప్పారు.
మరో రెండు వారాల్లో యూఏఈ వేదికగా జరుగబోయే ఆసియా కప్‌నకు ముందు డ్రీమ్ 11తో ఒప్పందాన్ని రద్దు చేసుకున్న బీసీసీఐ.. ఆ టోర్నీలో ప్రధాన స్పాన్సర్ లేకుండానే బరిలోకి దిగనున్నట్టు తెలుస్తున్నది. ఇంత తక్కువ వ్యవధిలో కొత్త స్పాన్సర్‌తో ఒప్పందాన్ని కుదుర్చోకోవడంపై బీసీసీఐ సైతం అనాసక్తిగా ఉన్నట్టు సమాచారం. సైకియా సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే టీమ్ఇండియా స్పాన్సర్‌షిప్‌ను దక్కించుకోవడానికి ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ‘టొయొటొ’ ఆసక్తి చూపిస్తున్నట్టు బోర్డు వర్గాల వినికిడి. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.