న్యూఢిల్లీ: వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్లు చూసేందుకు స్నేహితులెవరూ తనను టికెట్లు అడగవద్దని, అందరూ ఇళ్ల నుంచే మ్యాచ్లను చూసి ఎంజాయ్ చేయాలని టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రిక్వెస్ట్ చేశాడు. ఈ మేరకు తన స్నేహితులను ఉద్దేశించి ఇన్స్టా ఖాతాలో విరాట్ ఒక పోస్టు పెట్టాడు.
‘దేశంలో 2023 క్రికెట్ వరల్డ్ కప్ సంరంభం మొదలైంది. ఈ సందర్భంగా నా స్నేహితులందరికీ ఒక అభ్యర్థన చేస్తున్నా. టోర్నీ ఆసాంతం దయచేసి స్నేహితులెవరూ తనను టికెట్లు ఇప్పించమని అడగవద్దు. హాయిగా టీవీల్లో చూస్తూ ఇళ్ల నుంచే మ్యాచ్లను ఎంజాయ్ చేయండి’ అని తన ఇన్స్టా పోస్టులో విరాట్ పేర్కొన్నాడు.
కాగా, క్రికెట్ వరల్డ్ కప్-2023 రేపటి (గురువారం) నుంచి ప్రారంభం కానున్నది. తొలి మ్యాచ్లో ఇంగ్లండ్, న్యూజీలాండ్ జట్లు తలపడనున్నాయి. భారత్ తన తొలి మ్యాచ్ అక్టోబర్ 8న ఆడనుంది. ఆస్ట్రేలియాతో జరిగే తొలి మ్యాచ్ ద్వారా భారత్ తన వరల్డ్ కప్ జర్నీని మొదలుపెట్టనుంది. ఆస్ట్రేలియాకు కూడా ఈ వరల్డ్ కప్లో అదే తొలి మ్యాచ్.