Champions Trophy | కరాచీ: స్వదేశంలో జరుగుతున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఆతిథ్య పాకిస్థాన్‌కు మొదటి మ్యాచ్‌లోనే షాక్ తగిలింది. బుధవారం కరాచీలోని నేషనల్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 60 పరుగుల తేడాతో పరాభవం పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన కివీస్.. 50 ఓవర్లలో 5 వికెట్లకు 320 పరుగుల భారీ స్కోరు చేసింది. విల్ యంగ్ (107), టామ్ లాథమ్ (118 నాటౌట్) శతకాలతో మెరవగా గ్లెన్ ఫిలిప్స్ (39 బంతుల్లో 61, 3ఫోర్లు, 4సిక్స్‌లు) మెరుపులు మెరిపించాడు. ఛేదనలో పాక్.. 47.2 ఓవర్లలో 260 పరుగులకు కుప్పకూలింది.
ఖుష్దిల్ షా (69) పోరాడినా అతడికి సహకరించేవారు కరువవడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. బాబర్ (90 బంతుల్లో 64) మరీ నెమ్మదిగా ఆడాడు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌కు 73 పరుగులకే ముగ్గురు కీలక బ్యాటర్లు పెవిలియన్ చేరినా ఆ జట్టును యంగ్, లాథమ్ నిలబెట్టారు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కు 118 పరుగులు జోడించారు. యంగ్ నిష్క్రమించినా అతడి స్థానంలో వచ్చిన ఫిలిప్స్ వేగంగా ఆడి కివీస్ భారీ స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. లాథమ్, ఫిలిప్స్ చివరి 10 ఓవర్లలో 113 రన్స్ రాబట్టారు.
భారీ ఛేదనలో 22 పరుగులకే షకీల్ (6), రిజ్వాన్ (3) వికెట్లను కోల్పోవడంతో పాక్ నెమ్మదిగా ఆడింది. ఫలితంగా 28వ ఓవర్లో ఆ జట్టు వంద పరుగుల మార్కును అందుకుంది. సల్మాన్ అఘా (42) వేగంగా ఆడేందుకు యత్నించినా అతడి నిష్క్రమణతో పాక్ బ్యాటర్లు తడబడ్డారు. 81 బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన బాబర్‌ను సాంట్నర్ పెవిలియన్‌కు పంపాడు. చివర్లో ఖుష్దిల్ భారీ మెరుపులతో పాక్ విజయంపై ఆశలు రేపినా.. ఓరూర్క్ అతడిని ఔట్ చేయడంతో పాక్ ఓటమి ఖరారైంది.