Olympic Gold Medal : ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒలింపిక్స్ (Olympics 2024) పండుగ మరో 8 రోజుల్లో షురూ కానుంది. ప్యారిస్ వేదికగా పలు దేశాల అథ్లెట్ల కవాతుతో విశ్వక్రీడల సమరం ప్రారంభం కానుంది. అనంతరం పతకం కోసం అథ్లెట్లు నువ్వా నేనా అన్నట్లు తలపడనున్నారు. గెలుపొందిన వాళ్లు పోడియం మీద నిలబడి సగర్వంగా మెడల్‌ను స్వీకరించనున్నారు. ఇక గోల్డ్ మెడల్ (Gold Medal) మెడలో పడిందంటే అథ్లెట్ల ముఖం కోటి వెలుగుల కొవ్వొత్తులా వెలిగిపోతుంది. ఇంతకూ విజేతకు బహూకరించే గోల్డ్ మెడల్లో గోల్డ్ ఎంత ఉంటుందో తెలుసా..?
మెరిసేదంతా బంగారం కాదు. ఈ సామెత ప్రస్తుతం ఒలింపిక్ విజేతలకు అందజేస్తున్న స్వర్ణ పతకాలకు కూడా వర్తిస్తుంది. అవును.. పోడియం మీద విన్నర్ల మెడలో వేసే పసిడి పతకంలో వెండిదే సింహభాగం. అవును.. గోల్డ్ మెడల్‌ను 92.5 శాతం వెండితో తయారు చేస్తారు. దానిపై 6 గ్రాముల స్వచ్ఛమైన బంగారాని పూతగా వేసి సింగారిస్తారు. టోక్యో ఒలింపిక్స్‌లో ఇదే తరహా మెడల్‌ను విజేతలకు ఇచ్చారు. అప్పుడు ఆ మెడల్ ధర 800 డాలర్లు పలికింది. కాంస్య పతకంలో 95 శాతం కాపర్, 5 శాతం జింక్ కలగలిసి ఉంటుంది.
ఒలింపిక్స్ పతకాన్ని విజేతలకు పండ్లతో కొరికి మరీ ఫొటోలకు పోజిస్తారు. ఇంతకూ ఈ సంప్రదాయం ఎప్పుడు మొదలైంది? అసలు మెడల్ విన్నర్స్ అలా ఎందుకు చేస్తారు? అనేది తెలుసుకోవాలనుందా.. ఒలింపిక్స్ మెడల్ అనేది అథ్లెట్ల ప్రతిభకు, కఠోర సాధనకు ప్రతీక. అందుకే ఆ పతకానికి విలువెక్కువ.
అయితే.. మెడల్‌ను కొరికే సంప్రదాయం 3 వేల ఏండ్ల క్రితమే మొదలైందని చెప్తారు. అప్పట్లో విజేతలు స్వచ్ఛమైన బంగారంతో చేసిన పసిడి పతకాన్ని ఇచ్చేవారు. దాంతో, ‘అది నిజంగా శుద్ధమైన బంగారమా? కాదా?’ అనేది తెలుసుకోవడానికి అప్పట్లో గోల్డ్ మెడల్ విన్నర్స్ పంటితో కొరికి మరీ చెక్ చేసేవాళ్లు. ఒకవేళ అది ప్యూర్ గోల్డ్ మెడల్ అయితే దానిపై ‘పంటి గాట్లు’ స్పష్టంగా కనిపించేవి. కానీ, 1912 నుంచి విజేతలకు స్వచ్ఛమైన బంగారంతో చేసిన గోల్డ్ మెడల్స్‌ను ఇవ్వడంపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిషేధం విధించింది. అయినా సరే విన్నర్స్ పతకాలను పంటి అంచున పెట్టుకొని కొరకడం మాత్రం ఆగలేదు.