High Court | హైదరాబాద్, ఆగస్టు8 (నమస్తే తెలంగాణ): క్రికెట్ లీగ్ నిర్వహణకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) అపెక్స్ కౌన్సిల్ రాసిన లేఖను ప్రామాణికంగా తీసుకుని ఏవిధమైన మ్యాచ్‌లను నిర్వహించరాదని హెచ్‌సీఏకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆటగాళ్ల ఎంపిక నిమిత్తం లీగ్ మ్యాచ్‌లను నిర్వహించేందుకు హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ రాసిన లేఖను సవాలు చేస్తూ హైదరాబాద్ చార్మినార్ క్రికెట్ క్లబ్ పిటీషన్ వేసింది. దీనిని గురువారం జస్టిస్ నగేష్ భీమపాక విచారణ జరిపి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాథమిక ఆధారాల ప్రకారం అపెక్స్ కౌన్సిల్ రాసిన లేఖ అంబుడ్స్‌మన్ ఆదేశాలకు, బైలాస్కు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు.
అందుకే లీగ్ మ్యాచ్‌లను నిర్వహించరాదని హెచ్‌సీఏకు మధ్యంతర ఆదేశాలు చేస్తున్నట్లు వివరించారు. హెచ్‌సీఏ కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసి విచారణను వాయిదా వేశారు. పిటీషనర్ తరఫు న్యాయవాది వాదనలను వినిపిస్తూ, క్రికెట్ ఆటగాళ్ల ఎంపిక నిమిత్తం లీగ్ మ్యాచ్ లు నిర్వహించాలంటూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అపెక్స్ కౌన్సిల్ జూలై 2న రాసిన లేఖ అంబుడ్స్‌మన్ జూన్ 14న ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకమన్నారు. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు విచారణను వచ్చే నెల 5కి వాయిదా వేసింది.