Novak Djokovic : పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణం కొల్లగొట్టిన నొవాక్ జకోవిచ్ (Novak Djokovic) 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ వేటలో ఉన్నాడు. యూఎస్ ఓపెన్(US Open 2024)లో డిఫెండింగ్ చాంపియన్‌గా ఆడనున్న జకో ఆదివారం హార్డ్ కోర్టులో హంగామా చేశాడు. విశ్వ క్రీడ(Olympics)ల్లో గెలుపొందిన పసిడి పతకాన్ని మెడలో వేసుకొని కోర్టులోకి వచ్చాడు. అతడిని చూసిన అభిమానులు చప్పట్లు కొడుతూ స్వాగతం పలకగా..జకో అందరికీ అభివాదం చేస్తూ సందడి చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మాజీ వరల్డ్ నంబర్ 1 నొవాక్ జకోవిచ్ తన కల సాకారం చేసుకున్నాడు. విశ్వ క్రీడల్లో ఏండ్లుగా ఊరిస్తున్న బంగారు పతకాన్ని కొల్లగొట్టాడు. కెరీర్లో 24 గ్రాండ్‌స్లామ్స్‌తో చరిత్ర సృష్టించిన జకో ఎట్టకేలకు పారిస్ ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ పట్టేశాడు. తొలిసారి ఒలింపిక్స్ ఫైనల్ చేరిన అతడు.. మట్టి కోర్టులో హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో కార్లోస్ అల్కరాజ్(Carlos Alcaraz)పై 7-6, 7-6తో అద్భుత విజయం సాధించాడు.
Novak Djokovic steps on court at the US Open with his Olympic Gold Medal.
Shining. 🥇
— The Tennis Letter (@TheTennisLetter) August 24, 2024
ప్రపంచ టెన్నిస్‌లో అత్యుత్తమ ఆటగాళ్లు అయిన జకోవిచ్, అల్కరాజ్‌లు ఫైనల్లో కొదమ సింహాల్లా తలపడ్డారు. బలమైన సర్వ్‌లతో పాటు పోటాపోటీగా టై బ్రేక్ పాయింట్లు సాధిస్తూ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టారు. అయితే.. తొలి సెట్‌ను 7-6తో గెలుపొందిన జకో.. రెండో సెట్లోనూ జోరు చూపించాడు. అల్కరాజ్ సైతం గట్టి పోటీనిచ్చినా చివరకు జకోవిచ్‌దే పై చేయి అయింది.