Toxic Teaser | ‘కేజీఎఫ్–2’ విడుదలైన నాలుగేళ్ల విరామం తర్వాత కన్నడ స్టార్ యశ్ మరోసారి బాక్సాఫీస్ రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే ఈసారి అతను ఎంచుకున్న ప్రాజెక్ట్ మొదటి నుంచే ఆసక్తితో పాటు అనుమానాలకు కూడా కారణమైంది. భారీ మాస్ ఇమేజ్ సంపాదించిన యశ్, ‘టాక్సిక్’ సినిమాను మలయాళ దర్శకురాలు గీతు మోహన్ దాస్ చేతుల్లో పెట్టడం అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. సెన్సిబుల్ కథనాలతో పేరు తెచ్చుకున్న ఆమె యశ్ లాంటి మాస్ హీరోను ఎలా చూపిస్తుందన్నదే అందరిలోనూ సందేహం. మలయాళంలో గీతు తీసిన సినిమాలు కథ, భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేలా ఉంటాయి. అలాంటి దర్శకురాలి నుంచి యశ్ అభిమానులు ఆశించే హీరోయిజం, మాస్ మూమెంట్స్, పవర్ ఫుల్ ఎలివేషన్లు ఉంటాయా లేదా అన్న ప్రశ్నలు మొదటి నుంచే వినిపించాయి. కానీ ఈ సందేహాలన్నింటికీ సమాధానంగా ‘టాక్సిక్’ టీమ్ తాజాగా విడుదల చేసిన వయొలెంట్ టీజర్ నిలిచింది.
ఈ టీజర్ విడుదలైన క్షణం నుంచే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. విజువల్స్, ఫ్రేమ్ కంపోజిషన్లు హాలీవుడ్ సినిమాలను గుర్తుకు తెచ్చేలా ఉండగా, స్టైలిష్ ప్రెజెంటేషన్‌తో పాటు మాస్ టచ్ కూడా స్పష్టంగా కనిపించింది. అయితే ఇందులో యశ్ పాత్రను ఎంత రా అండ్ వైల్డ్‌గా చూపించారో తెలియజేసే ఓ సన్నివేశం మాత్రం ప్రేక్షకులను షాక్‌కు గురిచేసింది. కారులో ఉన్న సీన్లో వినూత్నంగా చూపించిన యాక్షన్ ఐడియా నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంతకు ముందు ఇండియన్ సినిమాల్లో చూడని విధమైన ఆలోచన కావడంతో టీజర్‌పై చర్చ మరింత వేడెక్కింది.
సాధారణంగా ఇలాంటి వయొలెంట్, బోల్డ్ సీన్స్‌ను సందీప్ రెడ్డి వంగా వంటి దర్శకులు తీస్తే పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. కానీ గీతు మోహన్ దాస్ లాంటి లేడీ డైరెక్టర్ ఈ తరహా సీన్‌ను తన సినిమాలో పెట్టడం నిజంగా ఊహించని విషయమేనని అంటున్నారు. దీంతో సోషల్ మీడియాలో స్పందనలు రెండు వర్గాలుగా చీలిపోయాయి. ఒక వర్గం “ఇదే మాస్ ఎలివేషన్” అంటూ టీజర్‌ను ఆకాశానికెత్తేస్తుంటే, మరో వర్గం మాత్రం ఇండియన్ సినిమాల హద్దులు దాటుతున్నాయంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. రెస్పాన్స్ మిక్స్‌డ్‌గా ఉన్నప్పటికీ, ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. ‘టాక్సిక్’ టీజర్ విడుదలైన రోజే ఈ సినిమా పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోయింది. యశ్ రీ ఎంట్రీ సినిమాగా ‘టాక్సిక్’ ప్రేక్షకుల్లో అంచనాలను కొత్త స్థాయికి తీసుకెళ్లిందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.