శ్రీనగర్: జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) యూ టర్న్ తీసుకున్నారు. జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన నిర్ణయించారు. గందర్బాల్ నియోజకవర్గం నుంచి ఒమర్ అబ్దుల్లా పోటీ చేస్తారని ఆయన పార్టీ ప్రకటించింది. ఎన్సీ ఎంపీ సయ్యద్ రుహుల్లా మెహదీ, ఆ పార్టీ ప్రావిన్షియల్ ప్రెసిడెంట్ నాసిర్ అస్లాం వనీ ఆదివారం ఈ విషయాన్ని వెల్లడించారు. గందర్బాల్ జిల్లాలోని నునేర్ గ్రామానికి ఒమర్ అబ్దుల్లా ఆదివారం చేరుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన రాజకీయ నేత సయీమ్ ముస్తఫా ఎన్సీలో చేరారు. ఈ సందర్భంగా గందర్బాల్ నియోజకవర్గం నుంచి ఒమర్ అబ్దుల్లా పోటీ చేస్తారని ఎన్సీ నేతలు సయ్యద్ రుహుల్లా మెహదీ, నాసిర్ అస్లాం వనీ వెల్లడించారు.
కాగా, జమ్ముకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్నంత వరకు తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని ఒమర్ అబ్దుల్లా ప్రకటించారు. ఆయన తండ్రి, ఎన్సీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని అన్నారు. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా దక్కిన తర్వాత తాను రాజీనామా చేస్తానని, అప్పుడు తన కుమారుడు ఒమర్ అబ్దుల్లా ఆ సీటు నుంచి పోటీ చేస్తారని చెప్పారు. అయితే తన ప్రకటన నుంచి యూ టర్న్ తీసుకున్న ఒమర్ అబ్దుల్లా జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు.