వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు ఆ దేశ పర్యటనకు వెళ్లిన దక్షిణాఫ్రికా.. నాలుగో టీ20లో గెలిచి సిరీస్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. ఆదివారం వెల్లింగ్టన్ వేదికగా ఇరుజట్ల మధ్య జరిగిన నాలుగో టీ20లో సఫారీలు.. 19 పరుగుల తేడాతో కివీస్‌ను ఓడించారు. లో స్కోరింగ్ థ్రిల్లర్‌గా సాగిన మ్యాచ్‌లో స్పిన్నర్ల దెబ్బకు రెండు జట్ల బ్యాటర్లు పరుగుల కోసం తంటాలు పడ్డారు. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా.. నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 164 రన్స్ చేసింది.
కొనర్ ఎస్తర్హుజెన్ (57) మినహా మిగిలిన బ్యాటర్లు తేలిపోయారు. ఛేదనలో న్యూజిలాండ్.. 18.5 ఓవర్లకు 145 రన్స్‌కే ఆలౌట్ అయింది. రాబిన్సన్ (32) టాప్ స్కోరర్. స్వల్ప ఛేదనలో పవర్ ప్లే ముగిసేసరికి 63/2గా ఉన్న ఆ జట్టు.. 82 పరుగులకు పది వికెట్లు కోల్పోయి పరాభవం వైపు నిలిచింది. సఫారీ బౌలర్లలో గెరాల్డ్ కొయెట్జ్ (3/31) మూడు వికెట్లు పడగొట్టగా సుబ్రయెన్, కెప్టెన్ కేశవ్, బార్ట్‌మన్ తలా రెండు వికెట్లు తీశారు. సిరీస్ విజేతను నిర్ణయించే ఆఖరి టీ20 ఈనెల 25న జరుగుతుంది.