Online Cricket Betting | ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఆదివారం పాకిస్థాన్, టీం ఇండియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌పై ఆన్లైన్ బెట్టింగ్‌కు దిగిన ఇద్దరు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ద్వారా ఔత్సాహికుల బెట్టింగ్‌ను ప్రోత్సహించిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు మంగళవారం తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు మాల్వియ నగర్‌లోని ఓ ఇంటిపై పోలీసుల బృందం దాడి చేసింది.
ఆ ఇంట్లో ఆయాన్ (32), నిజాం అలియాస్ భుట్టో (45) లు ఔత్సాహికులను ఆన్లైన్ బెట్టింగ్‌కు ప్రోత్సహిస్తూ దొరికి పోయారని ఢిల్లీ సౌత్ జోన్ డీసీపీ అంకిత్ చౌహాన్ ఓ ప్రకటనలో తెలిపారు. వారి వద్ద నుంచి బెట్టింగ్ పరికరాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. బెట్టింగ్స్ ద్వారా రూ.13 లక్షల సొమ్మును సంపాదించినట్లు నిందితులు చెప్పారన్నారు. ఆ సొమ్ము కూడా జప్తు చేసి వారిపై కేసు నమోదు చేశామన్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతుందని అంకిత్ చౌహాన్ వెల్లడించారు.