KL Rahul : భారత క్రికెటర్ కేఎల్ రాహుల్(KL Rahul) 33వ వసంతంలో అడుగుపెట్టాడు. మూడు ఫార్మాట్లలో టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న రాహుల్‌కు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తమ స్టార్ ఆటగాడి బర్త్ డేను పురస్కరించుకొని ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) ఎక్స్‌లో స్పెషల్ వీడియో పోస్ట్ చేసింది. చిన్న పిల్లాడి నుంచి.. వరల్డ్ క్లాస్ బ్యాటర్‌గా రాహుల్ ఎదిగిన తీరును ఆ వీడియోలో కళ్లకు కట్టింది. ‘మేము ఎంతగానో ఇష్టపడే కేఎల్‌గా మారిన ఓ చిన్న బాలుడి ప్రయాణం’ అనే క్యాప్షన్‌తో ఢిల్లీ పోస్ట్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది
ఢిల్లీ క్యాపిటల్స్ పోస్ట్ చేసిన వీడియోలో రాహుల్ సుదీర్ఘ కెరియర్‌కు సంబంధించిన చిరస్మరణీయ రోజులు ఉన్నాయి. చిన్నప్పుడు అమ్మ రాజేశ్వరీతో ఉన్న ఫొటోతో మొదలవుతుందీ వీడియో. కర్నాటక తరఫున దేశవాళీలో రాహుల్ ఆడిన రోజుల్ని గుర్తు చేస్తూనే.. 2010లో అండర్ -19 వరల్డ్ కప్ జెర్సీతో ఉన్న ఫొటోను పోస్ట్ చేసింది ఢిల్లీ. అంతేకాదు 2015లో రాహుల్ తొలి టెస్టు సెంచరీ బాదడం, వన్డేల్లో అరంగేట్రంలోనే శతకంతో గర్జించిన తీరు..అదే ఏడాది టీ20ల్లోనూ వంద కొట్టేయడం వంటి విషయాల్ని పొందుపరిచారు.
Journey of a lil boy who became the KL we love 🥹🫶 pic.twitter.com/sadjnIq8JV
— Delhi Capitals (@DelhiCapitals) April 18, 2025
2020లో వికెట్ కీపింగ్ బాధ్యతలు తీసుకున్న రాహుల్.. ఛాంపియన్స్ ట్రోఫీ విజయంలో భాగమయ్యాడు. రాహుల్ 11 ఏళ్ల క్రికెట్ జర్నీలోని మైలురాళ్లను ఆవిష్కరించిన ఈ వీడియో ఫ్యాన్స్‌కు తెగ నచ్చేసింది. మరో విషయం.. బాలీవుడ్ హీరోయిన్ అథియా శెట్టిని పెళ్లి చేసుకున్న ఈ స్టార్ బ్యాటర్ ఈమధ్యే తండ్రి అయ్యాడు. దాంతో, అతడి పుట్టిన రోజున కూతురి పేరును వెల్లడించింది అథియ. తమ గారాలపట్టికి ‘ఎవారహ్’ Evaarah అంటే.. ‘దేవుడి కానుక’ అనే అర్థం వచ్చే నామధేయాన్ని ఎంచుకుందీ స్టార్ కపుల్.
ఐపీఎల్ 18వ ఎడిషన్‌లో ఢిల్లీ అగ్రస్థానంలో నిలవడంలో రాహుల్ పాత్ర ఎనలేనిది. అటు వికెట్ కీపర్‌గా.. ఇటు బ్యాటర్‌గా రెండు విధాలుగా జట్టుకు ఉపయోగపడుతున్నాడీ బ్యాటర్. టాపార్డర్ విఫలమైనా మిడిలార్డర్ ఆడుతూ ఢిల్లీకి వెన్నెముకలా నిలుస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఐదు మ్యాచుల్లో 154.55 స్ట్రయిక్ రేటుతో 238 రన్స్ కొట్టాడు రాహుల్. ఇందులో రెండు అర్ధ శతకాలు ఉన్నాయి. అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్.. 93 నాటౌట్.