Prithvi Shaw : ఐపీఎల్ 17వ సీజన్ మినీ వేలానికి సమయం దగ్గర పడుతోంది. దాంతో, ఫ్రాంచైజీలు ప్రధాన ఆటగాళ్లను అట్టిపెట్టుకుని.. ఏమాత్రం ఆకట్టుకోనివాళ్లను వదిలేస్తున్నాయి. ఈ నేపథ్యంలో 16వ సీజన్లో చెత్త ఆటతో విమర్శలపాలైన పృథ్వీ షా(Prithvi Shaw)ను.. ఢిల్లీ క్యాపిటల్స్ వదిలించుకుంటుందనే వార్తలు వినిపించాయి. అయితే.. ఢిల్లీ మాత్రం ఈ స్టార్ ఓపెనర్‌కు మరో చాన్స్ ఇవ్వాలని అనుకుంటుంది. అందుకు కారణం.. ఇంగ్లండ్ గడ్డపై జరిగిన వన్డే కప్(One Day Cup)లో పృథ్వీ దంచికొట్టాడు. పైగా ఒక్క సీజన్లో విఫలమైనంత మాత్రాన వేటు వేయడం సరికాదని ఢిల్లీ మేనేజ్మెంట్ భావిస్తోంది. దాంతో, లక్ అంటే మనోడిదే అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఐపీఎల్ 16వ సీజన్(IPL 2023)లో పృథ్వీ షా దారుణంగా విఫలమయ్యాడు. అతడిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) జట్టును నట్టేట ముంచాడు. ఈ విధ్వంసక ఓపెనర్ 8 మ్యాచుల్లో ఒక హాఫ్ సెంచరీతో కలిపి 106 పరుగులు చేశాడంతే. అతడితో పాటు మనీశ్ పాండే, మిచెల్ మార్ష్ భారీ స్కోర్లు చేయకపోవడంతో ఢిల్లీ ప్లే ఆఫ్స్ అవకాశాలు దెబ్బతిన్నాయి.
పృథ్వీ షా
ఐపీఎల్లో చెత్త ప్రదర్శన కారణంగా వెస్టిండీస్ పర్యటనకు సెలెక్టర్లు పృథ్వీని పక్కన పెట్టారు. మళ్లీ భారత జట్టులోకి రావాలంటే పరుగులు సాధించడం ఒక్కటే మార్గమని అనుకున్న షా.. ఇంగ్లండ్‌లో జరిగిన వన్డే కప్‌తో చితక్కొట్టాడు. సొమర్సెట్ (Somerset) జట్టుపై డబుల్ సెంచరీ (244), డుర్హం జట్టు(Durham)పై సెంచరీ(125 నాటౌట్)తో చెలరేగాడు.