జైపూర్: ఐపీఎల్-19లో హ్యాట్రిక్ పరాభవాల తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ మళ్లీ గెలుపుబాట పట్టింది. రాజస్థాన్ రాయల్స్‌ను వారి సొంత మైదానంలో చిత్తుచేస్తూ సీజన్లో నాలుగో విజయాన్ని నమోదుచేసింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో గెలిచింది. రాయల్స్ నిర్దేశించిన 226 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ.. 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కేఎల్ రాహుల్ (40 బంతుల్లో 75, 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), పతుమ్ నిశాంక (33 బంతుల్లో 62, 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపులు మెరిపించారు. తొలుత రియాన్ పరాగ్ (50 బంతుల్లో 90, 8 ఫోర్లు, 5 సిక్స్‌లు) కెప్టెన్ ఇన్నింగ్స్‌కు తోడు డొనొవన్ ఫెరీరా (14 బంతుల్లో 47 నాటౌట్, 2 ఫోర్లు, 6 సిక్స్‌లు) ధనాధన్ మెరుపులతో రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 225 రన్స్ చేసింది. రాయల్స్‌కు ఇది నాలుగో ఓటమి.
ఢిల్లీ తగ్గలే!
భారీ ఛేదనలో క్యాపిటల్స్ ఎక్కడా తగ్గలేదు. పవర్ ప్లేలోనే నిశాంక, రాహుల్ మెరుపులతో ఆ జట్టు వికెట్లేమీ నష్టపోకుండా 70 రన్స్ చేసింది. ముఖ్యంగా నిశాంక.. బౌలర్ ఎవరన్నదీ చూడకుండా ఆది నుంచే దంచుడు మంత్రాన్ని జపించాడు. ఆర్చర్ ఓవర్లో 4, 6తో బాదుడుకు శ్రీకారం చుట్టిన అతడు.. మూడో ఓవర్లో రెండు ఫోర్లు, సిక్స్‌తో రెచ్చిపోయాడు. బర్గర్ బౌలింగ్‌లోనూ రెండు సిక్స్‌లు కొట్టిన ఈ శ్రీలంక బ్యాటర్.. బ్రిజేష్ ఓవర్లో మిడ్‌వికెట్ బౌండరీతో 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఐపీఎల్లో అతడికిదే తొలి ఫిఫ్టీ. మరో ఎండ్‌లో రాహుల్.. బిష్ణోయ్‌ను లక్ష్యంగా చేసుకుని 4, 6, 6 బాదడంతో 9 ఓవర్లకే ఢిల్లీ 108/0తో లక్ష్యం దిశగా దూసుకెళ్లింది. అయితే జడ్డూ పదో ఓవర్లో నిశాంకను వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో ఆ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. నిశాంక నిష్క్రమించినా మూడో స్థానంలో వచ్చిన నితీష్ రాణా (17 బంతుల్లో 33, 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అండగా రాహుల్ గెలుపు బాధ్యతలను భుజానికెత్తుకున్నాడు. 27 బంతుల్లో అతడి అర్ధ శతకం పూర్తయింది. జడేజా 12వ ఓవర్లో 18 రన్స్ పిండుకున్న ఈ ద్వయం బర్గర్ బౌలింగ్‌లోనూ రెండు సిక్స్‌లు, ఫోర్ బాది రెండో వికెట్‌కు 30 బంతుల్లోనే 61 రన్స్ జోడించింది. కానీ ఐదు బంతుల వ్యవధిలో ఈ ఇద్దరూ నిష్క్రమించారు. రాణాను తుషార్, రాహుల్‌ను ఆర్చర్ ఔట్ చేయగా.. ప్రత్యర్థిపై రాయల్స్ బౌలర్లు ఒత్తిడి పెంచే యత్నం చేసినా అవి ఫలించలేదు. ఆఖరి 3 ఓవర్లలో క్యాపిటల్స్ విజయానికి 30 రన్స్ అవసరమవగా స్టబ్స్ (18*), అశుతోష్ (25*) లాంఛనాన్ని పూర్తిచేశారు.
పరాగ్ కెప్టెన్ ఇన్నింగ్స్
టాస్ నెగ్గి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్స్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలినా ఈ సీజన్లో బ్యాటింగ్ వైఫల్యంతో విఫలమవుతున్న పరాగ్ అసలైన సమయంలో ఫామ్‌లోకి వచ్చాడు. ముందు జురెల్, తర్వాత జడేజాతో కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడిన ఆసీస్ దిగ్గజ పేసర్ స్టార్క్, జెమీసన్ మొదట్లోనే రాయల్స్‌ను దెబ్బకొట్టారు. స్టార్క్ బౌలింగ్‌లో మొదటి బంతినే భారీ సిక్స్ కొట్టిన యశస్వి జైస్వాల్ (6).. ఫుల్‌టాస్‌గా విసిరిన మూడో బంతికి అతడికే క్యాచ్ ఇచ్చాడు. వండర్ కిడ్ వైభవ్ (4)ను జెమీసన్ క్లీన్‌బౌల్డ్ చేయడంతో రాయల్స్ 12 పరుగులకే ఓపెనర్లను కోల్పోయింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన పరాగ్.. జురెల్ (30 బంతుల్లో 42, 4 ఫోర్లు, 1 సిక్స్) అండతో ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. జెమీసన్ ఓవర్లో రెండు సిక్స్‌లతో పాటు బౌండరీతో జోరు పెంచిన అతడు.. అక్షర్ ఓవర్లోనూ రెండుసార్లు బంతిని స్టాండ్స్‌లోకి పంపాడు. మరో ఎండ్‌లో జురెల్ కెప్టెన్‌గా పూర్తి అండగా నిలిచాడు. నటరాజన్ ఓవర్లో లాంగాన్ మీదుగా సింగిల్‌తో పరాగ్ సీజన్లో తొలి అర్ధ శతకాన్ని పూర్తిచేశాడు. ధాటిగా ఆడుతున్న ఈ జోడీని ఢిల్లీ కెప్టెన్ అక్షర్ 12వ ఓవర్లో జురెల్‌ను ఔట్ చేయడంతో 102 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరదించాడు. జడ్డూ (20) నెమ్మదిగా ఆడినా పరాగ్ జోరు తగ్గించలేదు. జెమీసన్ ఓవర్లో హ్యాట్రిక్ బౌండరీలతో రెచ్చిపోయిన అతడు శతకానికి చేరువయ్యాడు. కానీ రెండో స్పెల్‌కు వచ్చిన స్టార్క్.. ఒకే ఓవర్లో జడ్డూ, పరాగ్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఆఖర్లో ఫెరీరా.. ఆకాశమే హద్దుగా చెలరేగి రాయల్స్ ఇన్నింగ్స్‌కు అదిరిపోయే ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. కుల్దీప్ వేసిన18వ ఓవర్లో మూడు సిక్స్‌లు దంచిన అతడు.. చివరి రెండు ఓవ ర్లలోనూ షాట్లు ఆడటంతో ఆతిథ్య జట్టు భారీ స్కోరు సాధించింది.
సంక్షిప్త స్కోర్లు
రాజస్థాన్: 20 ఓవర్లకు 225/6 (పరాగ్ 90, ఫెరీరా 47*, స్టార్క్ 3/40, అక్షర్ 1/39); ఢిల్లీ: 19.1 ఓవర్లకు 226/3 (రాహుల్ 75, నిశాంక 62, జడేజా 1/33, తుషార్ 1/38)