దుబాయ్: మహిళల ఆసియా కప్‌లో డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంక ఫైనల్ చేరుకొని భారత్‌తో టైటిల్ ఫైట్‌కు రెడీ అయింది. శుక్రవారం జరిగిన రెండో సెమీఫైనల్లో లంక 4 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌పై విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన ఈ పోరులో పాక్ ఇచ్చిన 131 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. పాక్ కెప్టెన్ ఫాతిమా సనా (4/33) బౌలింగ్ దెబ్బకు ఓ దశలో 33 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన లంక అద్భుతంగా పుంజుకుంది. హర్షిత (36), కవిషా దిల్హారి (33), ఇమేషా దులాని (24) జట్టును ఆదుకున్నారు.
చివర్లో నీలాక్షిక సిల్వా (14 నాటౌట్), కౌషాని (10 నాటౌట్) లంకను విజయ తీరాలకు చేర్చారు. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాక్ 20 ఓవర్లలో 130/5 స్కోరు చేసింది. కెప్టెన్ ఫాతిమా సనా (47 నాటౌట్), షవాల్ జుల్ఫికర్ (24), గుల్ ఫెరోజా (21) రాణించారు. లంక బౌలర్లలో చామరి, ప్రబోదా చెరో వికెట్లు పడగొట్టారు. ఆదివారం జరిగే ఫైనల్లో భారత్, శ్రీలంక తలపడతాయి.