మోఖి: జూనియర్ ఆసియా కప్‌లో భారత హాకీ జట్టు ఫైనల్ చేరింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్.. శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్‌లో 3-1తో మలేషియాను ఓడించి ఈ టోర్నీలో వరుసగా నాలుగోసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ టోర్నీలో అంచనాలకు మించి రాణిస్తున్న కెప్టెన్ అన్మోల్ ఎక్కా (ఇప్పటిదాకా 16 గోల్స్ చేశాడు) రెండు గోల్స్ (16వ, 54వ నిమిషాల్లో)తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
తొలి క్వార్టర్లో గోల్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న భారత్.. రెండో క్వార్టర్ ఆరంభంలోనే లభించిన పెనాల్టీ కార్నర్‌ను అన్మోల్ గోల్‌గా మలచడంతో బోణీ కొట్టింది. 51వ నిమిషంలో సుఖ్వీందర్ గోల్‌తో ఆధిక్యాన్ని 2-0కు తీసుకెళ్లగా మరో 3 నిమిషాలకే వచ్చిన పెనాల్టీ కార్నర్‌ను మరోసారి అన్మోల్ గోల్ కొట్టి ఆధిక్యాన్ని 3-0కు పెంచాడు. ఆట మరో నిమిషంలో ముగుస్తుందనగా మలేషియా గోల్ చేసి ఆధిక్యాన్ని మాత్రమే తగ్గించగల్గింది. పాకిస్థాన్, సౌత్ కొరియా మధ్య జరిగే రెండో సెమీస్ విజేతతో భారత్ ఫైనల్ ఆడుతుంది.