బెంగళూరు : క్యాన్సర్‌ను గుర్తించేందుకు శునకాలకు వైద్యులు శిక్షణ ఇస్తున్నారు. బెంగళూరుకు చెందిన డాగ్నోసిస్ సంస్థ కుక్కలకు ఈ విషయంలో ట్రైనింగ్ ఇస్తున్నది. ఈ పద్ధతిలో రోగులు కాటన్ మాస్కులు పెట్టుకుని పది నిమిషాల పాటు శ్వాస తీసుకుంటారు. ఆ తర్వాత మాస్కులను సీజ్ చేసి ల్యాబ్‌కు పంపించగా.. అక్కడ కుక్కలకు మాస్కుల వాసన ఆధారంగా క్యాన్సర్ నమూనాలను గుర్తించడంలో ట్రైనింగ్ ఇస్తారు.
డాగ్నోసిస్ కర్ణాటకలోని 6 దవాఖానల్లో 1,502 మంది వ్యక్తుల శ్వాస నమూనాలను పరీక్షించింది. ఇందులో 7 రకాల క్యాన్సర్ ఉన్నవారు, క్యాన్సర్ లేని వారు కూడా ఉన్నారు. అయితే కుక్కలు అన్ని మాస్కుల్లో నుంచి క్యాన్సర్ నమూనాలున్న మాస్కులను 90 శాతం వేరు చేశాయని ఈ సంస్థ తెలిపింది. కానీ ఇది క్యాన్సర్‌ను గుర్తించే అధికారిక ప్రయోగం కాదని వెల్లడించింది. కాకపోతే క్యాన్సర్ రోగులకు ఎంత వరకు ఉపయోగపడుతుందనే కోణంలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు.