న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11 : వారానికి ఐదురోజుల పనిదినాలు తక్షణం ప్రవేశపెట్టాలని, పెండింగ్‌లో ఉన్న వేతన సంబంధ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా శుక్రవారం ప్రభుత్వరంగ బ్యాంక్‌లు సమ్మెలో పాల్గొన్నాయి. అయితే ప్రైవేట్ బ్యాంకులు యథావిధిగా పనిచేశాయి. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) పిలుపు మేరకు జరిగిన సమ్మెతో బ్యాంకింగ్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. అటు సిబ్బంది, ఇటు అధికారులు కూడా సమ్మెలో పాల్గొనడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడ్డాయి.
దీంతో నగదు డిపాజిట్లు, చెక్ క్లియరెన్స్‌లు, విత్‌డ్రాయల్స్ తదితర కార్యకలాపాలు చాలావరకు ప్రభుత్వ బ్యాంకులు, కొన్ని పాతతరం ప్రైవేట్ బ్యాంకుల్లో నిలిచిపోయాయి. అయితే యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాంటి డిజిటల్ సేవలు యథావిధిగా కొనసాగాయి. యూఎఫ్‌బీయూలో ఒక భాగమైన ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం మాట్లాడుతూ ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించకపోవడంతో సమ్మెకు దిగక తప్పలేదని అన్నారు. కాగా, శని, ఆదివారాలు బ్యాంకులకు సెలవులు ఇవ్వాలన్నది తమ ప్రధాన డిమాండ్ అని ఆయన చెప్పారు.