మాల్, అక్టోబర్ 4: దళిత మహిళపై దాడి జరిగిన ఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం పీకేమల్లేపల్లిలో చోటుచేసుకున్నది. మహిళా సంఘాల డబ్బులు కాజేసిన వివాదం ఏడాది కాలంగా కొనసాగుతున్నది. ఈ నెల 2న గాంధీ జయంతి రోజు పీకేమల్లేపల్లిలో గ్రామసభ నిర్వహించారు. డబ్బుల విషయమై మహిళా సంఘంలో విధులు నిర్వహిస్తున్న మహిళకు మాజీ సర్పంచ్ భర్తకు మధ్య వివాదం చోటుచేసుకున్నది.
సదరు వ్యక్తి దళిత మహిళపై దాడికి దిగాడు. ఈ ఘటనపై ఫిర్యాదు చేయగా, నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. దళిత మహిళపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దళిత సంఘాల నాయకులు ఆదివారం సాగర్-హైదరాబాద్ రోడ్డుపై ధర్నా చేశారు.