అయోధ్య: అయోధ్య రామాలయ విరాళాల చోరీకి సంబంధించిన దర్యాప్తుపై కాంగ్రెస్ పలు ప్రశ్నలు సంధించింది. ఆలయ విరాళాల చోరీకి సంబంధించి సీసీటీవీ ఫుటేజీలో 105 ఘటనలు కనిపించాయని, అయితే కేవలం ఎనిమిది మందినే నిందితులుగా పేర్కొనడంపై ఆ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం చోరీకి సంబంధించిన వీడియో జూన్ 4న రామ మందిర ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్కు చేరింది.
జూన్ 5న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అయితే ఎఫ్ఐఆర్ మాత్రం జూన్ 25న నమోదైంది. ఈ 21 రోజుల వ్యవధిలో ఏం జరిగిందో దేశ ప్రజలకు వివరించాలని రమేశ్ డిమాండ్ చేశారు. చంపత్ రాయ్, ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రాలను సాక్షులుగా మాత్రమే ఎందుకు పరిగణిస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటివరకు రూ.79.85 లక్షలు మాత్రమే రికవరీ కావడంపైనా కాంగ్రెస్ ప్రశ్నలు లేవనెత్తింది.పూర్తి వాస్తవాలు వెలుగులోకి రావాలంటే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తు జరగాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది.