న్యూయార్క్, అక్టోబర్ 4: అందరిలానే తాను కూడా ఎవరినో ప్రేమించి, పెండ్లి చేసుకుంటే ఏం వెరైటీగా ఉంటుంది అని భావించిన అమెరికాకు చెందిన ఒక యువతి ఒక వినూత్న మార్గాన్ని ఎంచుకుంది. ఉద్యోగ ఖాళీ తరహాలో ఆమె ఆన్లైన్లో ‘మొగుడు కావాలి’ అని ఒక ప్రకటన ఇచ్చింది. న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం.. అప్పటికే డేటింగ్ యాప్స్ లాంటి వాటి ద్వారా తోడు కోసం వెతికి కాలాన్ని వృథా చేసుకుని విసిగి వేసారిన ఎరిన్ పాటర్సన్ అనే యువతి వినూత్నంగా ఒక గూగుల్ ఫామ్‌ను రూపొందించింది.
దానిలో ఆమె తనకు కావాల్సిన భర్త గురించి ప్రశ్నలను ఉంచింది. ‘నేను ఒక అందమైన, తెలివైన, సహృదయం గల, కాఫీ /డిన్నర్ చేస్తూ మంచి సంభాషణలు ఆస్వాదించే వ్యక్తి కోసం చూస్తున్నా’ అని పేర్కొంది. ఆ ఫాంలోని ప్రశ్నావళిలో దరఖాస్తు చేయబోయే వ్యక్తి వృత్తిపరమైన సంబంధాలు, కెరీర్ లక్ష్యాలు, సంబంధాల పట్ల అంచనాలకు సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి. అంతేకాక దరఖాస్తుదారుడి వృత్తిపరమైన లక్ష్యాలు, అతడి రోజువారీ దినచర్య, వ్యాయామ విధానాలు, పెండ్లిపై, కుటుంబంపై అతడి అభిప్రాయాలకు సంబంధించిన ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఆమె ప్రకటనకు అనూహ్య స్పందన వచ్చింది. ఆమెను పెండ్లాడటానికి పలువురు క్యూ కట్టారు. ఇప్పటివరకు ఆమెకు 240 దరఖాస్తులు వచ్చాయి. ఇది వినూత్నమైన ఆలోచన అని పలువురు నెటిజన్లు ప్రశంసించారు.