న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11 : పదేపదే అంతరాయాల మధ్య వర్షాకాల సమావేశాలు అసంపూర్ణంగా జరిగిన నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్) బిల్లును ఆమోదింపచేయడానికి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ముగిసిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వారు చెప్పారు. ఒకవేళ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేస్తే నవరాత్రి సమయంలో దానిని నిర్వహించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలించవచ్చని వర్గాలు తెలిపాయి. దుర్గాదేవి ఆరాధనతో ఆ పండుగకు ఉన్న అనుబంధం, మహిళా సాధికారతకు అది ప్రతీకగా నిలవడమే దీనికి కారణంగా పేర్కొన్నాయి. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన సవరణ బిల్లును ఆమోదింపచేయడానికి అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీని సాధించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తూనే ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించడం గమనార్హం.
131వ రాజ్యాంగ సవరణ బిల్లులో భాగంగా మహిళా రిజర్వేషన్‌తో పాటు డీలిమిటేషన్ బిల్లును కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఏప్రిల్‌లో జరిగిన మూడు రోజుల ప్రత్యేక సమావేశాల సమయంలో లోక్‌సభలో ఈ బిల్లుకు అవసరమైన మూడింట రెండు వంతుల ప్రత్యేక మెజారిటీ లభించలేదు. ఆ సమయంలో ఉభయ సభలలోనూ రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించడానికి అవసరమైన సంఖ్యాబలం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు లేదు. అయితే అప్పటి నుంచి చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు లోక్‌సభ, రాజ్యసభలలో అవసరమైన ప్రత్యేక మెజారిటీకి, వారికున్న బలానికి మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించాయి. ప్రత్యేక మెజారిటీకి అవసరమైన సంఖ్య లోక్‌సభలో 360 మంది ఎంపీలు, రాజ్యసభలో 164 మంది ఎంపీలుగా ఉంది. మే నెలలో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ భారీ ఎదురుదెబ్బ తిన్న తర్వాత బీజేపీ స్థానం బలపడింది. ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, ఎంకే స్థాలిన్ నేతృత్వంలోని డీఎంకే మధ్య విభేదాలు తలెత్తిన నేపథ్యంలో డీఎంకేకు చెందిన 22 మంది లోక్‌సభ ఎంపీల మద్దతును పొందే అవకాశాన్ని కూడా బీజేపీ పరిశీలిస్తున్నది.