Venkateshwarlu | పర్వతగిరి, సెప్టెంబర్ 5 : వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని కల్లెడ గ్రామానికి చెందిన రూరల్ డెవలప్మెంట్ ఫౌండేషన్ (ఆర్డీఎఫ్) పాఠశాల పీఈటీ, పారాలింపిక్స్ కాంస్య విజేత జీవాంజి దీప్తి తొలి కోచ్ బీ వెంకటేశ్వర్లు(54) అనారోగ్యంతో గురువారం మృతిచెందారు. గత 18 ఏళ్లుగా ఆర్డీఎఫ్ పాఠశాలలో పీఈటీగా పనిచేసి, అనేక మంది క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించిన వెంకటేశ్వర్లు ఐదారేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.
గత కొద్ది రోజుల క్రితం పారాలింపిక్స్‌కు దీప్తి సన్నద్ధమవుతున్న సమయంలో ఆమెతో మాట్లాడి పతకం సాధించాలని ప్రోత్సహించారు. మృతుడికి భార్య రమ, కుమార్తె ఉన్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలోని ఆయన స్వగృహంలో అంత్యక్రియలు నిర్వహించినట్లు ఆర్డీఎఫ్ ప్రధానోపాధ్యాయుడు అశోకాచారి తెలిపారు.