Daryl Mitchell : న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ డారిల్ మిచెల్(Daryl Mitchell) రికార్డు సృష్టించాడు. గత కొంతకాలంగా కివీస్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న అతడు వన్డేల్లో 2 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. 50 ఓవర్ల ఫార్మాట్లో నిలకడగా రాణిస్తున్న మిచెల్.. స్వదేశంలో పాకిస్థాన్‌తో జరిగిన రెండో వన్డేలో 43 పరుగులు చేసి 2 వేల క్లబ్లో చేరాడు.
తద్వారా ఈ ఫార్మాట్లో అత్యంత వేగంగా ఈ మైలురా యికి చేరిన తొలి కివీస్ బ్యాటర్‌గా గుర్తింపు సాధించాడు. 47వ ఇన్నింగ్స్‌లో మిచెల్ ఈ ఘనతకు చేరువయ్యాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆండ్రూ జోన్స్(Andrew Jones) పేరిట ఉంది. అతడు 1991 ఫిబ్రవరిలో 52వ ఇన్నింగ్స్‌లో 2,000 రన్స్ సాధించాడు. 2014లో ఆ జట్టు మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (Kane Williamson) 54 ఇన్నింగ్స్‌ల్లో 2 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. అంతర్జాతీయంగా చూస్తే.. తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 2K క్లబ్లో చేరిన ఎనిమిదో ఆటగాడిగా మిచెల్ రికార్డు లిఖించాడు.
Daryl Mitchell became the fastest New Zealand player to 2000 ODI runs ⚡ pic.twitter.com/Htjid1SHhB
— ESPNcricinfo (@ESPNcricinfo) April 5, 2025
వన్డే క్రికెట్లో వేగంగా 2వేల పరుగులు సాధించిన బ్యాటర్లు చాలామందే ఉన్నారు. అయితే.. ఈ జాబితాలో భారత జట్టు వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) అగ్రస్థానంలో నిలిచాడు. రెండేళ్ల క్రితం సెంచరీల మీద సెంచరీలు బాదిన గిల్ 38 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయికి చేరుకున్నాడు. 40 ఇన్నింగ్స్‌ల్లో 2వేల క్లబ్లో చేరిన దక్షిణాఫ్రికా వెటరన్ హషీమ్ ఆమ్లా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. పాకిస్థాన్ ఆటగాడు జహీర్ అబ్బాస్, ఇంగ్లండ్ మాజీ సారథి కెవిన్ పీటర్సన్, పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజంలు.. 45 ఇన్నింగ్స్‌ల్లో 2 వేల పరుగులు సాధించారు.