Viral Video : వృద్ధురాలైన అత్తపై ఓ కోడలు అమానుషంగా వ్యవహరించింది. వయస్సులో పెద్దది అని కూడా చూడకుండా ఆమెను జుట్టుపట్టి కింద పడేసింది. అంతటితో ఆగకుండా ఫ్లోర్‌పై పడేసి కొంతదూరం ఈడ్చుకెళ్లింది. అదే సమయంలో ఆమె సోదరుడు, తండ్రి.. ఆమె భర్తపై దాడికి పాల్పడ్డారు. మధ్యప్రదేశ్ (Madhyapradesh) రాష్ట్రం గ్వాలియర్ (Gwalior) లోని ఆదర్శకాలనీలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇంట్లోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
వివరాల్లోకి వెళ్తే.. గ్వాలియర్‌కు చెందిన విశాల్ బాత్రా కార్ల స్పేర్ పార్టులకు సంబంధించిన దుకాణం నిర్వహిస్తున్నాడు. అతడు తన తల్లి సరళ బాత్రా, భార్య, కుమారుడితో కలిసి ఉంటున్నాడు. అతడికి కోట్ల రూపాయల విలువ చేసే ఇల్లు ఉంది. ఈ క్రమంలో ఈ నెల 1న విశాల్ బాత్రా ఇంట్లోకి అతడి మామ, బావ మరిది, మరో ఇద్దరు వ్యక్తులు చొరబడ్డారు. లోపలికి రావడంతో విశాల్ బాత్రా మామ అతడిని చెంపపై కొట్టాడు.
దాంతో విశాల్ బాత్రా తిరిగి కొట్టబోయాడు. దాంతో అతడి బావమరిది మరో ఇద్దరు విశాల్ బాత్రాపై దాడికి పాల్పడ్డారు. కొడుకు కాపాడుకునేందుకు సరళ బాత్రా అడ్డంపడింది. దాంతో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఆమె కోడలు పరుగున కిందకు వచ్చింది. వచ్చీ రావడంతోనే అత్త జుట్టుపట్టి కిందకు లాగేసింది. ఆమెపై పిడిగుద్దులు గుద్దుతూ ఫ్లోర్‌పై ఈడ్చుకెళ్లింది. లేచి కూర్చునేందుకు ప్రయత్నించిన ఆమెను కిందపడేసి మరోసారి దాడిచేసింది.
మరోవైపు విశాల్ బాత్రాను అతడి మామ, బావమరుదులు ఇంటి బయటికి ఈడ్చుకెళ్లి దాడి చేశారు. అనంతరం సరళ బాత్రాను కూడా బయటికి గెంటేసి, ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోయారు. తల్లీకొడుకులపై దాడికి సంబంధించిన దృశ్యాలు ఇంట్లోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దాడి సందర్భంగా మైనర్ అయిన విశాల్ బాత్రా కొడుకు భయంతో తచ్చాడటం కూడా వీడియోలో కనిపిస్తోంది.
ఘటనపై విశాల్ బాత్రా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ముందుగా కేసు నమోదు చేసేందుకు నిరాకరించిన పోలీసులు ఆ తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారని చెప్పాడు. తన తల్లిని ఓల్డేజ్ హోమ్‌లో వేయాలనేది తన భార్య ఉద్దేశమని, అందుకు తాను నిరాకరించడంతో రోజూ గొడవపడుతోందని తెలిపాడు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 1న తండ్రిని, సోదరుడిని పిలిపించి దాడి చేయించిందని చెప్పాడు. మీరట్‌లో మాదిరిగా తన భార్య తనను, తన తల్లిని చంపుతుందని భయంగా ఉందని అన్నాడు.