వలిగొండ, ఏప్రిల్ 05 : దివంగత రిటైర్డ్ ఎస్ఈ గూడూరు మోహన్‌రెడ్డి సేవలు మరువలేనివని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. వలిగొండ మండలంలోని ఎదుళ్లగూడెం గ్రామానికి చెందిన గూడూరు మోహన్‌రెడ్డి సంతాప సభ శనివారం నిర్వహించారు. సంతాప సభకు ఎమ్మెల్సీ కవిత హాజరై మోహన్‌రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోహన్ రెడ్డి రైతుల అభివృద్ధి, సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారని, శ్రీ వేంకటేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా ఎదుళ్లగూడెం గ్రామ పరిధిలో సుమారు 600 ఎకరాల భూమికి సాగునీరు అందించేందుకు ఎత్తిపోతల పథక రూపకల్పనకు ఆయన చేసిన కృషి మరువలేనిది అని కొనియాడారు.
Valigonda : మోహన్‌రెడ్డి సేవలు మరువలేనివి : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ బోర్డు బిల్లుతో సుమారు 30 కోట్ల మంది ముస్లిం మైనార్టీలకు అన్యాయం జరుగుతుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ముస్లింలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉండి పోరాడుతుందన్నారు. కాంగ్రెస్ అగ్ర నేతలెవరూ వక్ఫ్ బోర్డు బిల్లు చర్చలో పాల్గొనలేదన్నారు. కాంగ్రెస్ మొదటి నుంచి ముస్లింలపై కపట ప్రేమ నటిస్తుందని విమర్శించారు. అనంతరం టేకులసోమారం గ్రామ పరిధిలోని పడమటి జంగారెడ్డిలో ఎండిన పంట పొలాలను బీఆర్ఎస్ నేతలతో కలిసి ఆమె పరిశీలించారు. ఇది ప్రకృతి తెచ్చిన కరువు విపత్తు కాదని కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువుతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతరం ఎదుళ్లగూడెం గ్రామ పరిధిలోని శ్రీ వేంకటేశ్వర ఎత్తిపోతల పథకాన్ని సందర్శించి గూడూరి మోహన్ రెడ్డి ఎత్తిపోతల పథకానికి అందించిన సేవలలను ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, మండలాధ్యక్షుడు తుమ్మల వెంకట్‌రెడ్డి, నాయకులు పడమటి మమతా నరేందర్ రెడ్డి, మొగుళ్ల శ్రీనివాస్, రిటైర్డ్ వ్యవసాయ శాఖ అధికారులు శ్యామ్ సుందర్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, సత్తిరెడ్డి, బడుగు సత్యనారాయణ, బోడపట్ల జాన్ రెడ్డి, దాన్ రెడ్డి పాల్గొన్నారు.