CWC 2025 | ఐసీసీ వుమెన్స్ వన్డే ప్రపంచకప్ నెగ్గిన భారత జట్టులోని సభ్యులను ఘనంగా సత్కరించడంతో పాటు నజరానా ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వన్డే ప్రపంచకప్‌లో భారత్ చారిత్రాత్మక విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళా జట్టు ఫైనల్లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి టైటిల్ గెలిచింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అధ్యక్షతన మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో మహారాష్ట్రకు చెందిన ముగ్గురు క్రికెటర్లను సత్కరించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో సీఎం ఫడ్నవీస్‌తో పాటు డిప్యూటీ సీఎంలు ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ పాల్గొన్నారు. స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్, రాధా యాదవ్‌లను ఘనంగా సత్కరించడంతో పాటు నజరానా ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు. నజరానా ఎంత ఇవ్వనున్నారనే తెలియరాలేదు. టీమిండియా ప్రపంచకప్‌ను సాధించడంపై కేబినెట్ ప్రశంసలు కురిపించింది.
అయితే, ఎంత నగదు పారితోషకం ఇవ్వనుందో మాత్రం తెలియరాలేదు. ఇదిలా ఉండగా.. భారత వుమెన్స్ జట్టును ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు మంగళవారం ముంబయి నుంచి ఢిల్లీకి బయలుదేరింది. వుమెన్స్ జట్టును బుధవారం ప్రధాని సత్కరించనున్నారు. సోమవారం ఆలస్యంగా ప్రధాని కార్యాలయం నుంచి వుమెన్స్ జట్టుకు పిలుపు అందింది. గతంలో ప్రధాని మెన్స్ జట్టును అభినందించిన విషయం తెలిసిందే. యూఎస్-వెస్టిండిస్ వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు విజయం సాధించగా.. ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన భారత జట్టు ఆ తర్వాత మెరైన్ డ్రైవ్ మార్గంలో విక్టరీ పరేడ్ నిర్వహించింది. ప్రపంచకప్ గెలిచిన భారత మహిళల జట్టుకు బీసీసీఐ ఇప్పటికే భారీ నజరానా ప్రకటించింది. రూ.51కోట్ల ప్రైజ్‌మనీ ఇవ్వనున్నట్లు తెలిపింది.