గురువారం 01 అక్టోబర్ 2020
Sports - Aug 23, 2020 , 21:58:30

ఇప్పుడున్న టీమిండియాయే అత్యుత్తమ జట్టు

ఇప్పుడున్న టీమిండియాయే అత్యుత్తమ జట్టు

ముంబై : విరాట్ కోహ్లీ నాయకత్వంలోని జట్టు భారత క్రికెట్‌లో అత్యుత్తమ టెస్ట్ జట్టుగా సునీల్ గవాస్కర్ అభివర్ణించారు. విరాట్ జట్టు అత్యంత సమతుల్యతతో ఉన్నదని చెప్పారు. ఈ జట్టులో మంచి బ్యాట్స్‌మెన్‌తో పాటు మంచి బౌలర్లు కూడా ఉన్నారని, విరాట్ స్వయంగా అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడని కితాబునిచ్చాడు. చాలా టెస్ట్ మ్యాచ్‌లలో భారత్‌ను కోహ్లీ గెలిపించుకున్నాడని, టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమ్ ఇండియాను అగ్రస్థానానికి తీసుకువెళ్లారన్నారు.

"భారతదేశానికి మంచి బౌలింగ్ టీం ఉంది. ఇది కూడా చాలా ముఖ్యం. మీరు ఇరవై వికెట్లు తీసుకోకపోతే, ఒక్క మ్యాచ్ కూడా గెలవలేరు. 2018 లో అదే మేము ఇంగ్లండ్‌లో చూశాం. 2017 దక్షిణాఫ్రికాలో కూడా ప్రతిసారీ 20 వికెట్లు పడగొట్టాము. కాని ఎక్కువ పరుగులు చేయలేదు. ఇప్పుడు మనం బాగా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుందని అనుకుంటున్నా. ఇప్పుడు మనం ఆస్ట్రేలియా జట్టు కంటే ఎక్కువ పరుగులు చేయగలం" అని చెప్పారు.

పేస్ దాడి అద్భుతమైనది

"భారత్ ఇప్పుడు చాలా సామర్థ్యం కలిగి ఉన్నది. టీమిండియా బౌలర్లు ఆస్ట్రేలియా 20 వికెట్లు పడగొట్టగలరు. ఈ జట్టు అత్యుత్తమ టెస్ట్ జట్టు అని నమ్ముతున్నాను. సాంకేతికత, సామర్థ్యం మెరుగ్గా ఉన్నాయి. మెరుగైన బ్యాట్స్‌మెన్‌లతో మంచి స్పిన్నర్లు ఉన్నారు. ప్రపంచ స్థాయి ఫాస్ట్ బౌలర్లు జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, ఇశాంత్ శర్మ ఉన్నారు ” అని పేర్కొన్నారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రోహిత్ శర్మ లాగా బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాను అని తన మదిలో మాట చెప్పారు.


logo