Cristiano Ronaldo : ఫుట్‌బాల్ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo) 2023 ఏడాదిని ఘనంగా ముగస్తున్నాడు. ఈ ఫార్వర్డ్ ఆటగాడు ఈ ఏడాది 54 గోల్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సౌదీ ప్రో లీగ్(Soudi Pro League)లో శనివారం ఆల్ తవోన్ (Al Taawoun) జట్టుపై అతడు 54వ గోల్ కొట్టాడు. తద్వారా ఐదు పర్యాయాలు ఈ ఫీట్ సాధించిన ఫుట్‌బాలర్‌గా రొనాల్డో రికార్డు సృష్టించాడు. గతంలో 2011, 2013, 2014, 2015లో అతడు అత్యధిక గోల్స్ సాధించాడు.
ఫ్రాన్స్ యువ కెరటం ఎంబాపే(Mbappe), ఇంగ్లండ్ స్టార్ హ్యారీ కేన్(Harry Kane) 52 గోల్స్‌తో సంయుక్తంగా రెండో స్థానంలో కొనసాగుతున్నారు. ఎర్లింగ్ హాలాండ్ 50 గోల్స్‌తో మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. మరోవైపు రొనాల్డో ప్రత్యర్థి, వరల్డ్ కప్ విజేత లియోనల్ మెస్సీ(Lionel Messi) మాత్రం 44 మ్యాచుల్లో 28 గోల్స్‌తో నిరాశపరిచాడు.
రొనాల్డో, లియోనల్ మెస్సీ
‘నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు వ్యక్తిగతంగా, జట్టు పరంగా ఇదొక మంచి ఏడాది. నేను చాలా గోల్స్ కొట్టాను. పోర్చుగల్ జట్టుతో పాటు ఆల్నస్రీ క్లబ్ విజయాల్లో భాగమయ్యాను. వచ్చే ఏడాది కూడా ఇదే తరహాలో చెలరేగుతానని భావిస్తున్నా’ అని 38 ఏండ్ల రొనాల్డో అన్నాడు.
రొనాల్లో ఈ ఏడాది 59 మ్యాచ్‌లు ఆడాడు. 92వ నిమిషంలో మెరుపు గోల్‌తో జట్టు ఆధిక్యాన్ని మూడుకు పెంచాడు. దాంతో, అల్ నస్రీ క్లబ్(Al Nassri) 4-1తో గెలుపొంది పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. అల్ హిలాల్ జట్టు 53 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
ఖతార్‌లో నిరుడు జరిగిన ఫిఫా వరల్డ్ కప్(FIFA World Cup) రొనాల్డో కెరీర్‌ను మలుపుతిప్పింది. టోర్నీ సమయంలో ఇంగ్లండ్ జర్నలిస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ కారణంగా మాంచెస్టర్ యునైటెడ్(Manchester United) క్లబ్‌తో ఒప్పంద్దం రద్దయింది. దాంతో, ఈ స్టార్ ప్లేయర్‌ను అల్ నస్రీ క్లబ్ రికార్డు ధరకు సొంతం చేసుకుంది. రెండున్నర ఏండ్ల కాలానికి రూ.4,400 కోట్లకు కాంట్రాక్టు కుదుర్చుకుంది.