Venkatesh Iyer : భారత యువ క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్(Venkatesh Iyer) త్వరలోనే ఇంటివాడు కానున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)తో పాపులర్ అయిన అయ్యర్.. శృతి రఘునాథన్(Shurthi Raghunathan)ను వివాహం చేసుకోబోతున్నాడు. మంగళవారం వీరిద్దరి ఎంగేజ్మెంట్(Engagment Ceremony) కన్నులపండువగా జరిగింది. ఇరువురి కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో అయ్యర్, శృతి సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. తన జీవితంలోని ముఖ్యమైన ఈ సందర్భాన్ని అయ్యర్ సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.
‘నా జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం’ అంటూ తమ పూలుపండ్ల వేడుక ఫొటోలను అయ్యర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ చూసిన భారత క్రికెటర్లు రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad), మన్దీప్ సింగ్(Mandeep Singh)తో పాటు పలువురు సెలబ్రిటీలు అయ్యర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కర్నాటకకు చెందిన శృతి బీ.కామ్ పూర్తయ్యాక నిఫ్ట్(NIFT)లో ఫ్యాషన్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ చదివింది. ప్రస్తుతం ఆమె బెంగళూరులో లైఫ్‌స్టయిల్ ఇంటర్నేషనల్ కంపెనీకి మర్చండైస్ ప్లానర్‌గా సేవలందిస్తోంది.
ఐపీఎల్‌తో వెలుగులోకి వచ్చి.. టీమిండియా జెర్సీ(Team India Jersey) వేసుకున్న క్రికెటర్లలో అయ్యర్ ఒకడు. 2021 సీజన్లో ఈ లెఫ్ట్ హ్యాండర్ రెచ్చిపోయి ఆడాడు. 10 మ్యాచుల్లో 41.11 సగటుతో 370 పరుగులు చేసి సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. ఆల్‌రౌండర్‌గానూ అదరగొట్టే అయ్యర్ ఇప్పటివరకూ భారత జట్టు తరఫున 9 టీ20లు, 2 వన్డేలు ఆడాడు.
వెంకటేశ్ అయ్యర్
ఈ విధ్వంసక ఓపెనర్‌ను కోల్‌కతా 2023 మినీ వేలంలో రూ.8 కోట్ల భారీ ధరకు కొన్నది. 16వ సీజన్లో ఒక సెంచరీతో కలిపి అయ్యర్ 404 పరుగులతో రాణించాడు. అయితే.. ఆండ్రూ రస్సెల్, మన్దీప్ సింగ్‌తోపాటు బౌలింగ్ యూనిట్ విఫలమవ్వడంతో నితీశ్ రానా(Nitish Rana) నేతృత్వంలోని కోల్‌కతా ప్లే ఆఫ్స్ చేరలేకపోయింది.