అహ్మదాబాద్ : శతాబ్ద కాల విరామం తర్వాత ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చడానికి భారత్ ప్రధాన కారణమని బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునక్ అభిప్రాయపడ్డారు. క్రికెట్ ప్రేమికుడైన సునక్.. ఐపీఎల్-18 ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు అహ్మదాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా సునక్ మాట్లాడుతూ.. ‘21వ శతాబ్దిలో ప్రపంచ క్రికెట్‌పై భారత్ అధికంగా ప్రభావం చూపింది.
ఆట పట్ల ఇక్కడ ఉన్న అభిరుచి ప్రపంచాన్ని ప్రభావితం చేసింది. ఒలింపిక్స్‌లో వందేండ్ల తర్వాత క్రికెట్‌ను చేర్చడానికి ప్రధాన కారణం భారత్’ అని అన్నారు. 1900 ఒలింపిక్స్ తర్వాత 2028లో లాస్ ఏంజెల్స్ వేదికగా జరుగబోయే ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చిన విషయం విదితమే. భారత్‌లో జరిగే ఐపీఎల్, డబ్ల్యూపీఎల్ పైనా సునక్ ప్రశంసలు కురిపించారు.