మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Sports - Aug 30, 2020 , 00:22:45

ఐపీఎల్‌కు రైనా దూరం

ఐపీఎల్‌కు రైనా దూరం

  • కరోనా భయమే కారణమా! 
  • జట్టులో 13కు చేరిన కరోనా కేసులు 

  న్యూఢిల్లీ: ఐపీఎల్‌ 13వ సీజన్‌ ఆడేందుకు చెన్నై జట్టు ఏ ముహూర్తాన యూఏఈలో అడుగుపెట్టిందో కానీ.. అన్నీ ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. ఇప్పటికే ఆ ఫ్రాంచైజీకి చెందిన 13 మందికి కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. తాజాగా స్టార్‌ ఆటగాడు సురేశ్‌ రైనా లీగ్‌కు దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాల వల్ల రైనా స్వదేశానికి తిరుగు పయనమయ్యాడని ఫ్రాంచైజీ సీఈవో కేఎస్‌ విశ్వనాథన్‌ శనివారం తెలిపాడు. అయితే.. కొవిడ్‌-19 భయం కారణంగానే  రైనా స్వదేశానికి వచ్చేసినట్లు సమాచారం. టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ ధోనీతో కలిసి ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రైనా.. ఇక పూర్తిగా ఐపీఎల్‌పైనే దృష్టి పెట్టాలనుకుంటున్న సమయంలో అనుకోని విధంగా ఈ సీజన్‌కు దూరమయ్యాడు. లీగ్‌ ఆరంభానికి ఇంకా చాలా సమయం ఉన్నా అతడు మొత్తం సీజన్‌కు దూరం కావడానికి గల కారణాలు తెలియడం లేదు. ఫ్రాంచైజీకి చెందిన 13 మందికి మహమ్మారి సోకడంతోనే రైనా ఈ నిర్ణయానికి వచ్చాడని.. ఈ అంశంపై జట్టు పెద్దలతో మాట్లాడినా లాభం లేకపోవడంతోనే స్వదేశానికి వచ్చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రోజురోజుకు కేసులు పెరుగుతున్న కారణంగా మానసిక ఆందోళనకు గురైన రైనా..కుటుంబం దగ్గరకు వెళ్లేందుకు అర్ధాంతరంగా వైదొలిగాడని లీగ్‌ వర్గాలు పేర్కొన్నాయి. 


logo