Champions Trophy | ఛాంపియన్స్ ట్రోఫీ విజేతకు ట్రోఫీ బహుకరణ సమయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ప్రతినిధిని ఆహ్వానించకపోవడంపై వివాదం చోటు చేసుకున్నది. దుబాయిలో జరిగిన వేడుకల్లో సీఈవో, చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ డైరెక్టర్ సుమైర్, పీసీబీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుమైర్ అహ్మద్‌ను వేదికపైకి పిలువకపోవడంపై ఐసీసీ ఎదుట పీసీబీ నిరసన వ్యక్తం చేసేందుకు సిద్ధమైంది. అయితే, సుమైర్ను వేదికపైకి ఆహ్వానించకపోవడంపై ఐసీసీ ఇచ్చిన వివరణపై పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ సంతృప్తి చెందలేదని పీసీబీ వర్గాలు పేర్కొన్నాయి. దుబాయి వేదికగా జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్‌పై భారత జట్టు నాలుగు వికెట్ల తేడాతో గెలిచిన విసయం తెలిసిందే.
వాస్తవానికి ఐసీసీ టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చింది. కానీ, పాక్‌కు భారత్ వెళ్లేందుకు నిరాకరించడంతో హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. దాంతో ఫైనల్ సహా మిగతా అన్ని మ్యాచులను టీమిండియా దుబాయిలోనే జరిగాయి. ఆదివారం జరిగిన ఫైనల్ అనంతరం విజేతకు ఐసీసీ చైర్మన్ జై షా ట్రోఫీని అందజేశారు. ఆ సమయంలో వేదికపై పీసీబీ తరఫున ప్రతినిధులు ఎవరూ కనిపించలేదు. అవార్డుల ప్రదానోత్సవం, మ్యాచ్ అధికారులకు పతకాలను బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, బీసీసీఐ కార్యదర్శి దేవ్జిత్ సైకియా, న్యూజిలాండ్ క్రికెట్ సీఈవో రోజర్ టౌసే వేదికపై ఉన్నారు.
పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ సైతం వేదికపై పీసీబీ తరఫున ఎవరూ పాల్గొనకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, మొహ్సిన్ నఖ్వీ వేదికపైకి వచ్చేందుకు ఏర్పాటు చేస్తామని ఐసీసీ స్పష్టం చేసింది. ఫైనల్ మ్యాచ్‌కు ఆయన రాకపోవడంతపో ప్రణాళికలను మార్చున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఐసీసీ వివరణను పీసీబీ తిరస్కరించింది. టోర్నీ సమయంలో ఆతిథ్య దేశానికి సంబంధించి ఐసీసీ అనేక తప్పులు చేసిందని సంబంధిత వర్గాలు ఆరోపించాయి. భారత్-బంగ్లా మ్యాచ్ లైవ్ మ్యాచ్ సమయంలో చాంపియన్స్ ట్రోఫీ 2025 లోగో మార్పు.. లాహోర్‌లో ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య భారత జాతీయ గీతాన్ని ప్లే చేయడం వంటి ఇందులో ఉన్నాయి.
అయితే, ప్లే లిస్ట్‌లో లోపం కారణంగా భారత జాతీయ గీతాన్ని కొన్ని సెకన్ల పాటు ప్లే అయ్యిందని.. ఆ తర్వాత తప్పును సరిదిద్దినట్లు ఐసీసీ పేర్కొంది. ఇదిలా ఉండగా.. టోర్నీ విజయవంతం కావడంపై పీసీబీ చైర్మన్ సంతోషం వ్యక్తం చేశారు. టోర్నీకి సహకరించిన అధికారులు, ఐసీసీతో పాటు పాకిస్తాన్‌కు వచ్చిన జట్లకు కృతజ్ఞతలు తెలిపారు. అందరి నిబద్ధత, సమష్టి కృషి వల్ల ప్రతిష్టాత్మక టోర్నీని విజయవంతంగా నిర్వహించడం సాధ్యమందని.. ఈ విషయంలో పాకిస్తాన్ చాలా గర్వంగా ఉందంటూ పీసీబీ చైర్మన్ నఖ్వీ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.