WPL 2023 : మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తొలి సీజన్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఎన్నో అంచనాలతో మొదలుకానున్న ఈ మెగా టోర్నమెంట్‌కు ముందు గుజరాత్ జెయింట్స్ జట్టు వివాదంలో నిలిచింది. ఫిట్నెస్ లేదనే కారణంతో విండీస్ ఆల్‌రౌండర్ డియేండ్ర డాటిన్పై వేటు వేసింది. అయితే.. తనను అకారణంగా డబ్ల్యూపీఎల్ నుంచి తప్పించారని డాటిన్ ఆరోపించింది. తన ప్లేస్‌లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కింబెర్లీ గార్త్‌ను తీసుకోవడం సరికాదని ఆమె తెలిపింది.
‘తొందరగా కోలుకోవాలని నాకు మెసేజ్‌లు పంపిస్తున్నవాళ్లను అభినందిస్తున్నా. అయితే.. నిజం ఏంటంటే..? నేను ఎలాంటి గాయం నుంచి కోలుకోవడం లేదు. ధన్యవాదాలు’ అని సోషల్‌మీడియాలో పోస్ట్‌లో రాసుకొచ్చింది. ట్రీట్మెంట్ తీసుకున్న డాటిన్ ఇంకా కోలుకోలేదని చెప్పి గుజరాత్ జెయింట్స్ డాటిన్‌ను తప్పించింది. ఈమధ్యే ముగిసిన వేలంలో కింబెర్లీ గార్త్‌ను ఏ జట్టు కొనేందుకు ఆసక్తి చూపించలేదు. దక్షిణాఫ్రికాలో ముగిసిన టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఆసీస్ జట్టులో గార్త్ సభ్యురాలు. అయితే.. ఈమె కేవలం రెండు మ్యాచ్‌లు ఆడిందంతే.
డబ్ల్యూపీఎల్ వేలంలో రూ.50 లక్షల కనీస ధర ఉన్నడాటిన్ను గుజరాత్ జెయింట్స్ రూ. 60 లక్షలకు కొనుగోలు చేసింది. మహిళల ప్రీమియర్ లీగ్ ఈరోజు (మార్చి 4న) ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఆరంభ పోరులో బేత్ మూనీ సారథ్యంలోని గుజరాత్ జెయింట్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి.