Sania Mirza : భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా ఆటకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. మహిళల టెన్నిస్‌లో చెరగని ముద్ర వేసిన ఆమె దుబాయ్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో ఓటమితో కెరీర్ ముగించింది. అయితే.. సొంత గడ్డపై సానియా మ్యాచ్ చూడలేకపోయామని నిరాశ చెందిన అభిమానులకు గుడ్ న్యూస్. రేపు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఈ టెన్నిస్ ప్లేయర్ ఫేర్వెల్ మ్యాచ్ ఆడనుంది. ఆమె ఈ రోజు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడింది. తన కెరీర్‌కు సంబంధించి సానియా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 20 ఏళ్ల కెరీర్ ఎంతో సంతృప్తినిచ్చిందని సానియా తెలిపింది.
‘అభిమానుల కోసం రేపు చివరి మ్యాచ్ ఆడుతున్నా. విశేషం ఏంటంటే.. 20 ఏళ్ల క్రితం నేను ఎక్కడ టెన్నిస్ సాధన చేశానో అక్కడే ఆఖరి మ్యాచ్ ఆడునున్నా. ఈ మ్యాచ్ చూసేందుకు నా కుటుంబం, స్నేహితులు వస్తున్నారు. కెరీర్లో చివరి మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదరు చూస్తున్నా. విజయంతో కెరీర్‌ను ముగించాలని అనుకుంటున్నా’ అని సానియా వెల్లడించింది. అంతేకాదు తన కుమారుడు, కుటుంబంతో సమయం కేటాయిస్తానని ఈ టెన్నిస్ దిగ్గజం చెప్పుకొచ్చింది. డబుల్స్‌లో వరల్డ్ నంబర్ ర్యాంక్ సాధించిన సానియా ఆరు గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలిచింది. డబుల్స్‌లో, మిక్స్డ్ డబుల్స్‌లో మూడేసీ టైటిళ్లు సాధించింది. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మిక్స్డ్ డబుల్స్‌లో సానియా – బోపన్న జోడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
ఎల్బీ స్టేడియంలో రేపు సానియా రెండు మ్యాచ్‌లు ఆడనుంది. సానియా, రోహన్ బోపన్న టీమ్స్ తలపడనున్నాయి. డబుల్స్‌లో సానియా – బోపన్న జోడీ ఇవాన్ డోడిగ్ – మ్యాటెక్ సాండ్స్ జంటను ఢీ కొట్టనుంది. సానియా చివరి సారి ఆడనున్న ఈ రెండు మ్యాచ్‌లు చూసేందుకు చాలామంది బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు తరలి రానున్నారు.
టెన్నిస్‌లో ఎన్నో విజయాలు సాధించిన సానియా మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో మెంటర్‌గా కొత్త పాత్రలో కనిపించనుంది.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మెంటార్‌గా ఆమె సేవలందిచనుంది. ఈమధ్యే జట్టుతో కలిసిన ఆమె చాలామంది అమ్మాయిలతో మాట్లాడాను. చాలామంది చిన్న చిన్న సిటీల నుంచి వచ్చారు. రాయల్ ఛాలెంజర్స్ మెంటర్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. డబ్ల్యూపీఎల్ తొలి సీజన్ ఈరోజు (మార్చి 4న) ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఆరంభ పోరులో గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి.