గ్రేటర్ నోయిడా: కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత లిఫ్టర్లు తమ సత్తాచాటారు. స్టార్ లిఫ్టర్ మీరాబాయిచాను గైర్హాజరీలో అందివచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. మహిళల 49కిలోల విభాగంలో జ్ఞానేశ్వరి యాదవ్ పసిడి వెలుగులు విరజిమ్మింది. చత్తీస్‌గఢ్‌కు చెందిన ఈ 20 ఏండ్ల యువ లిఫ్టర్ మొత్తం 176(78కి+ 98కి) కిలోల బరువు ఎత్తి వ్యక్తిగతంగా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చింది.
రజత పతక విజేత జిల్లీ దాలాబెహరా 169కి(75కి+94కి) నుంచి గట్టి పోటీ ఎదురైనా జ్ఞానేశ్వరి పట్టు వదలకుండా కడదాకా తన ఆధిక్యాన్ని నిలుపుకుంది. పోటీ ముగిసిన తర్వాత స్పందిస్తూ ‘భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించడం మాత్రమే కాదు, స్వర్ణం గెలువడం చాలా సంతోషంగా ఉంది. పోటీకి ముందు ఒక విధమైన ఒత్తిడి ఉన్నా..కోచ్ సూచనలకు అనుగుణంగా మొత్తం ఆరుసార్లు బరువులు ఎత్తి అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాను’ అని అంది. పురుషుల 55కిలోల విభాగంలో ముకుంద్ 239కిలోలతో పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. మహిళల 55 కిలోల కేటగిరీలో శర్బానీదాస్కు రజతం, 45కిలోల విభాగంలో కోమల్ కోహర్‌కు స్వర్ణం దక్కాయి. మొత్తంగా భారత లిఫ్టర్లు వేర్వేరు విభాగాల్లో 19 పతకాలను కైవసం చేసుకున్నారు.