టోక్యో: ఒలింపిక్స్‌లో రెండో మెడల్ గెలిచి చరిత్ర సృష్టించిన పీవీ సింధు(PV Sindhu) విజయంలో ఆమె కోచ్ పార్క్ టై-సాంగ్ పాత్ర మరువలేనిది. ఒక రోజు ముందే సెమీఫైనల్లో ఓడి మానసికంగా కుంగిపోయిన ఆమెను.. తిరిగి బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌కు సిద్ధం చేసి, ప్రతిక్షణం కోర్టులో ఆమె ఉత్సాహంగా ఉండే పార్క్ ప్రోత్సహించాడు. సోమవారం ఉదయం సింధుతో కలిసి అతడు వర్చువల్‌గా మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా తాను సింధూతో హిందీలో చెప్పిన మాటల్ని గుర్తు చేసుకున్నాడు.
సింధు తీవ్ర ఒత్తిడిలో ఉన్న ప్రతిసారీ “ఆరామ్ సే” అంటూ ఆమెను కామ్‌గా ఉండేలా చేసినట్లు పార్క్ చెప్పాడు. ముఖ్యమైన సందర్భాల్లో పాయింట్ సాధించినప్పుడు, ఒత్తిడి తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు తర్వాతి షాట్లో తప్పులు చేయడం సాధారణమే. ఇలాంటి సమయాల్లో ప్రశాంతంగా ఉండాలని నేను ఆమెకు చెబుతాను అని పార్క్ అన్నాడు. అప్పుడు పక్కనే ఉన్న సింధు జోక్యం చేసుకుంటూ.. “ఆరామ్ సే” అని అనేవాడని చెప్పడంతో అతడు నవ్వాడు. అవును, నాకు ఆరామ్ సే అంటే ఏంటో నాకు తెలుసు అని అన్నాడు.
నేను ఆమెకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించే ముందే సింధు పెద్ద స్టార్. ఆమెకు గోల్డ్ మెడల్ తీసుకురావడానికి ప్రయత్నిస్తానని చెప్పాను. కానీ బ్రాంజ్ మెడల్ కూడా పెద్దదే అని పార్క్ అన్నాడు. అటు సింధు కూడా కోచ్ పార్క్‌పై ప్రశంసల వర్షం కురిపించింది.