Asia Cup | ఆసియా కప్ ఫైనల్లో భారత్ చేతిలో పాకిస్తాన్ దారుణంగా ఓటమిపాలైంది. ఈ టోర్నీలో వరుసగా మూడు మ్యాచుల్లో ఓటమిపాలైంది. దాంతో పాకిస్తాన్ క్రికెటర్లతో పాటు పీసీబీ చైర్మన్కు ఇబ్బందికరంగా మారింది. పీసీబీ చైర్మన్, హోంమంత్రి మొహ్సిన్ నఖ్వీ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా పీసీబీ చైర్మన్ నఖ్వీపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ విరుచుకుపడ్డాడు. క్రికెట్ బోర్డు.. రాజకీయాలు ఇందులో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాలని సూచించాడు. ‘మిస్టర్ నఖ్వీకి రిక్వెస్ట్ ఏంటంటే.. ఈ రెండు పదవులు కీలకమైనవి. సమాన సమయంతో పాటు శ్రద్ధ కూడా అవసరం. పీసీబీ వ్యవహారాలు హోమంత్రిత్వశాఖకు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. స్వతంత్రంగా నిర్వహించాలి. కానీ పాకిస్తాన్ క్రికెట్ భవిష్యత్తుకు అవసరమైన దశ’గా పేర్కొన్నాడు. నఖ్వీ తనకు క్రికెట్ గురించి పెద్దగా తెలియది పలుసార్లు అంగీకరించాడు. అయితే క్రికెట్కు సూక్ష్మ నైపుణ్యాలను అర్థం చేసుకునే సమర్థులైన సలహాదారులు అవసరమని.. నఖ్వీకి సలహాదారులపై మాత్రమే ఆధారపడి పీసీబీని నడపలేడని ఆఫ్రిది పేర్కొన్నాడు. పాకిస్తాన్ క్రికెట్కు పూర్తి సమయం, శ్రద్ధ వహించే వ్యక్తి అవసరమని.. లేకపోతే దాని భవిష్యత్తు మరింత చీకటిగా మారుతుందని అఫ్రిది వ్యాఖ్యానించాడు.
ఇదిలా ఉండగా.. ఆసియా కప్ ఫైనల్ విజయం అనంతరం నఖ్వీ చేతుల మీదుగా ఆసియా కప్ ట్రోఫీని అందుకునేందుకు భారత జట్టు నిరాకరించింది. యూఏఈ, శ్రీలంక క్రికెట్ చీఫ్ నుంచి మాత్రమే ట్రోఫీని స్వీకరిస్తామని స్పష్టం చేసింది. అయితే, ఏసీసీ చైర్మన్ హోదాలో ఉన్న నఖ్వీ అందుకు నిరాకరించాడు. టీమిండియా ట్రోఫీని తీసుకునేందుకు నిరాకరించడంతో ట్రోఫీని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) కార్యాలయానికి పంపాడు. అయినప్పటికీ, భారత జట్టు ట్రోఫీ లేకుండా సంబరాలు చేసుకుంది. ఈ చర్య పాకిస్తాన్ ప్రతిష్టను మరింత దిగజార్చింది. నఖ్వీ వ్యవహరించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. వీలైనంత తర్వగా పీసీబీ చైర్మన్ పదవా? రాజకీయాలా ? అనే విషయంపై నఖ్వీ త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆఫ్రిది సూచించాడు. రాజకీయాల్లో కొనసాగాలనుకుంటే పీసీబీ చైర్మన్ పదవిని వదులుకోవాలని.. పీసీబీలో కొనసాగాలనుకుంటే రాజకీయాలు, అధికార పదవులకు దూరంగా ఉండాలని సూచించాడు. క్రికెట్ పరిపాలన విషయంలో ఎలాంటి రాజీపడకూడదని.. నఖ్వీ ద్వంద్వ పాత్రల్లో కొనసాగడం వల్ల పాకిస్తాన్ క్రికెట్ మరింత పతనమవుతుందని హెచ్చరించాడు.