హార్సెన్స్ (డెన్మార్క్): ఊబర్ కప్‌లో భారత కథ ముగిసింది. గ్రూప్-ఏలో ఆడిన మూడు మ్యాచ్‌లకు గాను రెండింట్లో ఓడిన భారత్.. ఈ టోర్నీ నుంచి గ్రూప్ దశ లోనే వైదొలిగింది. గ్రూప్ స్టేజ్‌లో చైనాతో జరిగిన ఆఖరి పోరులో భారత మహిళా షట్లర్లు 0-5తో దారుణంగా ఓడారు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు మినహా మిగిలిన షట్లర్లలో ఎవరూ చైనా క్రీడాకారిణుల జోరు ముందు తేలిపోయారు. ఈ టోర్నీలో 16 సార్లు విజేత అయిన చైనా చేతిలో ఓడిపోవడం భారత్‌కు ఇది వరుసగా మూడోసారి.
సింగిల్స్ విభాగాల్లో పీవీ సింధు.. 16-21, 21-19, 19-21తో ప్రపంచ రెండో నంబర్ షట్లర్ వాంగ్ జియి చేతిలో పోరాడి ఓడింది. దేవికా.. 21-19, 17-21, 10-27తో జు వెన్ జింగ్ జోరుకు చిత్తవగా ప్రపంచ నాలుగో ర్యాంకర్ చెన్ యుఫీ 22-20, 21-13తో ఇషారాణిని మట్టికరిపించింది. డబుల్స్‌లో ప్రియా-శృతి ద్వయం.. 11-21, 8-21తో వరల్డ్ నంబర్ వన్ జోడీ లియు షెంగ్ షు, టాన్ నింగ్‌కు కనీస పోటీనివ్వలేకపోయారు. రెండో డబుల్స్‌లో తనీషా-కవిప్రియ జోడీ.. 10-21, 21-12, 19-21తో లువొ జు మిన్-జాంగ్ షు జియాన్‌ను చేతిలో ఖంగుతింది. గ్రూప్-ఏలో చైనా, ఆతిత్య డెన్మార్క్ టాప్-2లో నిలిచి క్వార్టర్స్‌కు దూసుకెళ్లగా భారత్, ఉక్రెయిన్ నిష్క్రమించాయి.